వైసీపీలో జగన్ ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు ! ఆయన మాటకు తిరుగులేదు. మంత్రి పదవుల్ని ప్రకటించే వరకూ ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా అసంతృప్తే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కావడం… జగన్తో నడిచిన వారు ఎక్కువగా ఉండటం.. కులం పేరుతో దూరం పెట్టడం వంటి కారణాల వల్ల ఈ అసంతృప్తి వచ్చింది. అయితే బయటపడుతుంది అని ఎవరూ అనుకోలేదు. రోడ్డెక్కుతారని.. రాజీనామాల వరకూ వెళ్తారని భావించలేదు.
కానీ ఇక్కడ బాలినేనిశ్రీనివాస రెడ్డి, సుచరిత వంటివాళ్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు. తమకు ఎమ్మెల్యే పదవులు కూడా వద్దంటున్నారు . నిజానికి వారికి మొదట్లో పదవులు ఇవ్వకపోతే పెద్దగా ఫీలయ్యేవారు కాదు కానీ ఇచ్చి తీసేయడం వల్ల ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అయితే బయటపడింది కొంతేననని.. మనసులో గూడు కట్టుకుపోతున్నది చాలా ఉందని వైసీపీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. అది బయటపడే సందర్భం ఇంకా రాలేదని అంటున్నారు.
ఇంత కాలం మంత్రి పదవుల ఆశతో చాలా మంది వైసీపీ హైకమాండ్ ఏది చెబితే అది చేస్తూ వెళ్లారు. తమ ప్రాంతాలను ప్రభుత్వం అవమానిస్తున్నా పట్టించుకోలేదు. చివరికి వారంతా అసంతృప్తిలో మునిగిపోతున్నారు. ఇలా అసంతృప్తి గూడు కట్టుకుపోతే.. రేపు పరిస్థితులు మరింత దిగజారిన తరవాత సీన్ మారిపోతుందని.. అప్పుడు కట్టు తెగితే ఆపడం కష్టమన్న వాదన ఉంది. దీనికి వైసీపీ పెద్దలు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాల్సి ఉంది.