ఉత్తరాంధ్ర వైకాపా నేతల్లో అసంతృప్తులు ఉన్నాయా.. అంటే, అవుననే అనిపిస్తోంది! విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్ర స్వామి తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లనే ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇదే కారణాన్ని పార్టీ అధినాయకత్వానికి ఆయన తెలిపినట్టు సమాచారం. అయితే, పార్టీ పదవికి రాజీనామా చేసిన కోలగట్ల, ఇప్పుడు పార్టీ వీడి బయటకి వచ్చేస్తారా..? తెలుగుదేశంలో చేరేందుకు వేదికను సిద్ధం చేసుకుంటున్నారా అనే చర్చ ఉత్తరాంధ్ర వైకాపా వర్గాల్లో జరుగుతోంది. ఉన్నట్టుండి కోలగట్ల ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమై ఉంటుందా అనే చర్చకు కూడా తెరలేచింది. ఈ సందర్భంలో వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ పేరు మరోసారి వినిపిస్తోంది.
నిజానికి, వైకాపాలోకి బొత్స సత్యనారాయణ చేరుతున్న తరుణంలోనే ఉత్తరాంధ్ర పార్టీ వర్గాల నుంచి రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. బొత్సకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కొంతమంది నేతలు వైకాపాలోకి వచ్చి చేరారు. చివరికి బొత్స కూడా వైయస్సార్ సీపీలోకి వచ్చేసరికి లుకలుకలు అప్పట్నుంచే మొదలయ్యాయి. రానురానూ బొత్స ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారనే అభిప్రాయాలు వినిపించాయి. ఇప్పుడు కోలగట్ల పదవిని వదులుకోవడం వెనక కూడా బొత్స ప్రమేయం ఉన్నట్టుగానే కొంతమంది అనుమానిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి వైకాపాలో తన ఆధిపత్యం కోసం బొత్స ప్రయత్నిస్తున్నారనీ, అలాగే ప్రతిపక్ష నేత జగన్ కూడా ఆయనకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనీ, ఇతర నేతల్ని ఆయన వరకూ వెళ్లనీయకుండా బొత్స అడ్డుపడుతున్నారనే అభిప్రాయం ఆ ప్రాంత నేతల్లో ఉందని చెప్పుకుంటున్నారు. కోలగట్లకు కూడా ఇదే అసంతృప్తి ఉందనీ, అందుకే ప్రస్తుతం పార్టీకి దూరమయ్యే క్రమంలో ఆయన ఉన్నారని అంటున్నారు. త్వరలోనే ఆయన పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఇలాంటి అసంతృప్తులను వైకాపా ముందుగా అంచనా వేయలేకపోతోందనీ, నష్టం జరిగే వరకూ ఇలాంటి పరిణామాలేవీ పైస్థాయికి చేరడం లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. కొన్నాళ్ల కిందటే ఉత్తరాంధ్రకు చెందిన ఓ బలమైన నేత వైకాపా వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోలగట్ల కూడా అదే బాటలో ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో బొత్స ప్రస్థావన ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంది! వాస్తవంలో ఏం జరుగుతోందో వైకాపాకి అంచనా వేయలేకపోతోందా..?