వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి వెంట నడిచిన వారికి రిక్త హస్తాలు చూపిస్తున్నారు. పదేళ్ల పాటు అనేక ఖర్చులు పెట్టుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు వస్తాయని ఎదురు చూస్తున్న వారికి రెండో సారి కూడా చాన్స్ మిస్సయింది. అలాంటి వారిలో అత్యధికులు రెడ్డి సామాజికవర్గ నేతలే ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి లాంటి నేతలంతా ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని గొణుక్కుంటున్నారు.
మొదటి విడతలో మంత్రి పదవులు రాక అసంతృప్తికి గురైన చాలా మంది ఇప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూశారు. కానీ ఇప్పుడూఅవకాశం దక్కలేదు. కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా.. జగన్ ఇష్టపడే భాషా ప్రయోగం చేసే జోగి రమేష్‌కు చాన్సిచ్చారు. కానీ పార్థసారధిని పట్టించుకోలేదు. ఇక మూడు, నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకూ చాన్స్ లేకుండా పోయింది.
మధ్యలో పార్టీలోకి వచ్చిన వారికి పదవులు దక్కుతున్నాయి. టిక్కెట్ హామీతో పార్టీలో చేరి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంలో దిట్టగా నిలిచిన విడదల రజనీతో పాటు పదవులన్నీ అనుభవించిన తర్వాత జగన వెంట నడిచిన ధర్మాన ప్రసాదరావు, బొత్స వంటి వారికి పదవులు లభించాయి. రాజకీయాల్లో ఎవరికైనా పదవులు పొందాలనే ఆశ ఉంటుంది.. జగన్‌కు అదే పనిగా విధేయత చూపించడానికి పదవులు ఇస్తారనే కారణం. వీరంతా ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.