కూటమి పార్టీల్లో చేరిపోవాలనుకునే వైసీపీ నేతల జాబితాల చాలా పెద్దగా ఉంది. అయితే చేరికలకు ఓ ప్రక్రియ పెట్టుకవడంతో వచ్చిన వారందర్నీ చేర్చుకోవడం లేదు. అన్ని పార్టీల నుంచి కలిసి ఐదారుగురుతో ఓ కమిటీని నియమించుకున్నారు. చేరుతామని వచ్చిన వారి ప్రతిపాదనల్ని కమిటీ ముందు పెడుతున్నారు. ఎవరికీ ఇబ్బంది లేకపోతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ పార్టీ మారాలనుకున్న వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బాలినేని, సామినేని ఉదయభాను .. జగన్ రెడ్డి పన్నిన ఉచ్చులో పడలేదు. జగన్ పార్టీ టీడీపీ నేతల్ని బూతులు తిట్టేవారిని ప్రోత్సహించేవారు. వారు ఆ భాషను ఉపయోగించలేదు. పవన్ ను బూతులు తిట్టనందుకే ఉదయభానుకు మంత్రి పదవి రాలేదు. ఆ విషయం వైసీపీలో అందరికీ తెలుసు. అందుకే .. చాన్సు వచ్చినప్పుడు కూడా జగన్ ప్రోత్సహించలేదని ఆయన బాధపడ్డారు. ఇక లైన్లో ఉన్న జాబితాలో కేతిరెడ్డి, విడదల రజనీ సహా.. చాలా మంది పేర్లు ఉన్నాయి. వారి చేరికలపై ఇంకా కూటమి కమిటీ నిర్ణయం తీసుకోలేదు.
ఆస్తులు కాపాడుకోవడానికి.. కేసుల నుంచి తప్పించుకునేందుకు వచ్చే వారిని చేర్చుకునేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా లేవు. చేరే వాళ్లు తమకు బలం కాకపోయినా పర్వాలేదు కానీ బలహీనత కాకూడదనుకుంటున్నారు. వైసీపీని బలహీనం చేసేందుకు వచ్చే అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. బాలినేని దూరం కావడంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుంది. ఇలాంటి నేతల్ని ప్రోత్సహించవచ్చని భావిస్తున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో చేరికలపై మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.