రోజా, జోగి రమేష్‌లపై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడికి ప్రయత్నం జరగడం సంచలనం సృష్టించింది. అయితే దీనికి కారణాలు మాత్రం అందరూ ఒకే రకంగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్, జనసేనపై వారు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఆ దాడి జరిగిందని… చెబుతున్నారు. రోజా, జోగి రమేష్ , కొడాలి నానితో పాటు మరికొంత మంది తమ నోటికి పని చెబుతూ ఉంటారు. ఇష్టారీతిన మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు.. తాము పవన్ కల్యాణ్ ను లేదా చంద్రబాబును తిడుతున్నామని.. సంతోషపడతారు. కానీ వారి మాటలు ఆయా పార్టీల కార్యకర్తల్లో అసహనం గూడు కట్టుకునేలా చేస్తుంది. అది బయటపడే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.
కొద్ది రోజుల కిందట కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో జరిగింది అదే. ఎక్కడా ఆర్గనైజ్డ్ దాడి జరగలేదు. ప్రజల్లో గూడుకట్టుకుపోయిన అసహనం చూపించుకోవడానికి అవకాశం వచ్చింది. చూపించారు. ఆ దాడుల్లో పాల్గొన్నది ఎక్కువ మంది వైసీపీ నేతలే. ఇక్కడ అసహనం పొంగితే.. పార్టీలు ఉండవు. అందరూ బాధితులే. అందరూ తమ కోపాన్ని చూపిస్తారు. విశాఖ విమానాశ్రయంలో జనసైనికుల్లో అలాంటి అసహనం కనిపించిందని అనుకోవచ్చు.
ఏపీలో కొంత మంది నేతలు అధికారం నెత్తికెక్కి.. కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తున్నారు . రాజకీయ హద్దుల్ని చెరిపేశారు. వ్యక్తిత్వ హననానికి .. వ్యక్తిగత దాడులకూ తెగబడ్డారు. వారికి అధికారం అండ ఉంది. అందుకే భరిస్తున్నారు.. భరిస్తున్నారు. కానీ రేపు వారికి అవకాశం వచ్చిన రోజున… తిరగబడిన రోజున పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అధికారం మారిన తర్వాత ఇలా ఓ జననసేన… టీడీపీ గుంపు ముందుగా… ఓ రోజా లేదా.. కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. పేర్ని నాని లాంటి వాళ్లు కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? వారికి రక్షణ కల్పించడం సాధ్యమేనా ? .తమ వైపు అధికార బలం ఉందని అనుకుంటే.. ఎదుటివాళ్లను కాపాడటం అసాధ్యమవుతుంది. ఇలాంటి అసహన పరిస్థితులు ఇప్పటికే కొన్ని సార్లు శాంపిల్‌గా ఏపీలో కనిపించాయి.
రాజకీయనేతలు సున్నితంగా వ్యవహరించాలి. అణిచివేత అధికం అయితే తిరుగుబాటు తీవ్రం అవుతుందని గ్రహించాలి. లేకపోతే జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఎవర్ని బ్లేమ్ చేసినా ఉపయోగడం ఉండదు. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది మరి.