తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మరో పార్టీ గెలవని నియోజకవర్గం హిందూపురం. మొదట ఎన్టీఆర్.. తర్వాత హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. బాలకృష్ణ రెండో సారి గెలిచారు. రాయలసీమలో టీడీపీ గెలిచిన రెండు మూడింటిలో హిందూపురం ఒకటి. అంతకు ముందు కన్నా బాలకృష్ణ మెజార్టీ పెంచుకున్నారు. అన్ని సార్లు గెలవడానికి టీడీపీకి ఎంత లక్ ఉందో.. ఇతర పార్టీలు అక్కడ వ్యూహాత్మకం గా రాజకీయాలు చేయలేకపోవడం కూడా టీడీపీ అభ్యర్థులు వరుసగా గెలవడానికి మరో కారణం. ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు.
తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఏకతాటిపై ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీలో ఒకరికి ఐదుగురు నేతలు ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త వారిని తీసుకొచ్చి పార్టీ హైకమాండ్ వారిని రద్దుతూండటంలో నేతలు పెరిగిపోతున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందన్నట్లుగా అక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి మారింది. ముందుగా నవీన్ నిశ్చల్ అనే నేత ఉండేవారు. ఆయనను కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే్ అబ్దుల్ ఘనీని పార్టీలో చేర్చుకున్నారు. చివరికి ఆయనను కూడా కాదని కర్నూలు జిల్లాకు చెందిన మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్‌కు టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. వారితో పాటు కొండూరు వేణుగోపాల్ రెడ్డి అనే మరో నేత కూడా నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ హైకమాండ్ ఇక్బాల్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే ఆయన మాజీ పోలీసు అధికారి. అలాగే డీల్ చేస్తున్నారు. మిగతా ముగ్గుర్ని పట్టించుకోవడం మానేశారు. ఇటీవల వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వంకార్యక్రమాన్ని వదిలేసి ఇక్బాల్ వ్యక్తిగత పర్యటన కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ.. ఎంపీ మాధవ్‌కు బాధ్యతలిచ్చి వెళ్లారు. దీంతో నవీన్ నిశ్చల్, అబ్దుల్ గని, కొండూరు వేణుగోపాల్ రెడ్డి అవమానంతో రగిలిపోయారు. తాము మాజీ సమన్వయకర్తలమేనని.. తమకూ గడపగడపకూ నిర్వహించేసత్తా ఉందని ప్రత్యేకంగాసమావేశాలు పెట్టుకుంటున్నారు. గతంలో వీరిలో ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పుడు ఇక్బాల్… తమ ముగ్గురిలో ఎవరినీ కాదని మళ్లీ ఎంపీని తెచ్చి పెట్టడంతో ముగ్గురు నేతలూ విభేదాలు పక్కన పెట్టి ఇప్పుడు ఏకతాటి పైకి వచ్చారు. ఇన్చార్జిలుగా మా హిందూ పురానికి చెందిన స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ లోకల్ సెంటిమెంట్ ను వినిపించడం ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ , ఎంపీ గోరంట్ల మాధవ్ నాయకత్వం మాకు వద్దంటూ తెగేసి చెబుతున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్న హిందూపురం దశ తిరిగిపోయింది. ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వేశారు. మంచి నీటి పథకాన్ని పూర్తి చేశారు.రూ. వందల కోట్లతో అభివృద్ధి జరిగింది. ఈ కారణంగానే బాలకృష్ణ కు మెజార్టీ పెరిగింది.అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రూపాయి అభివృద్ధి జరగకపోగా… సంక్షేమ పథకాల్లో వివక్ష చూపించడం కూడా వివాదాస్పదమయింది. ఇక హిందూపురం కేంద్రం లోక్‌సభ నియోజకవర్గం ఉన్నప్పటికీ జిల్లా చేయకుండా పుట్టపర్తిని జిల్లా చేయడంతోప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నేతలను సమన్వయం చేయకుండా… హిందూపురంలో బాలకృష్ణను ఢీకొట్టేలా పార్టీని సిద్ధం చేయలేరని వైసీపీ వర్గాలు గొణుక్కుటున్నాయి.