పించన్లు ఆపేస్తే రోడ్లు వేయవచ్చంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అందరూ ఇదే మాట చెబుతున్నారు. అది ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేయడానికని..లబ్దిదారులు.. రోడ్ల సొమ్ము తీసుకుంటున్నారన్న ట్లుగా చెప్పడానికి వైసీపీ నేతలు ఈ వాదన వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దస్థితిపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం రోడ్లపై పెద్దగా నిధులు వెచ్చించడం లేదు. నిర్వహణకు కూడా పెద్దగా ఖర్చు పెట్టకపోతూండంతో అధ్వాన్నంగా మారాయి. గ్రామాల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయని విమర్శలు వస్తున్నాయి. చాలా గ్రామాల ప్రజలు ప్రజా ప్రతినిదుల వద్దకు వెళ్తే ఇలాంటి సమాధానాలే వస్తున్నాయి. రోడ్లు వేయాలంటే సంక్షేమ పథకాలు ఆపేయాలన్నట్లుగా మాట్లాడుతున్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్లేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రతి నెల రూ.15 కోట్లు ఫించన్లకే సరిపోతున్నాయని, రోడ్డు మరమ్మతులు చేయాలంటే వాటిని రద్దు చేయాలని ఓ ఎమ్మెల్యే తేల్చేసారు. గత ప్రభుత్వాలు కూడా పింఛన్లు ఇచ్చాయని, ఇప్పుడు మాత్రమే ఇస్తున్నట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. బోడిగుండుకి, మోకాలికి ముడి వేసినట్లుందని అంటున్నారు.
వైసీపీ నేతల స్పందనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నా అదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమం పేరుతో లక్షల కోట్లు అప్పు చేస్తోంది. అవన్నీ ఏమవుతున్నాయో తెలియదు. ఓ వైపు మద్యం సహా ఇతర పన్నులు భారీగా పెంచారు. కానీ రాష్ట్ర ఇన్ ఫ్రాపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. కానీ రోడ్లేస్తే పథకాలు ఆగిపోతాయని బెదిరిస్తున్నారు.