ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును రాత్రి సమయంలో హఠాత్తుగా ప్రకటించడంతో.. ఏపీ రాజకీయాల్లో ఓ రకమైన కలకలం రేగింది. ఎందుకంటే.. కొన్నాళ్లకు కన్నా లక్ష్మినారాయణను వైసీపీ టార్గెట్ చేసింది. త్వరలో ఆయనను తొలగింప చేస్తున్నామని.. ఆయన స్థానంలో.. తమకు అనుకూలంగా ఉండే నేత మాత్రమే ఏపీ బీజేపీ అధ్యక్షుడు అవుతారని వైసీపీ వర్గాలు అంతర్గతంగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి. కన్నా చాలా దూకుడుగా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఆయనను కంట్రోల్ చేయడానికి అలా చెబుతున్నారేమో అని అనుకున్నారు కానీ.. చివరికి వైసీపీకి అనుకూలంగా ఉండే సోము వీర్రాజునే అధ్యక్షుడిగా ప్రకటించడంతో… వైసీపీ లాబీయింగే ఎక్కువగా పని చేసిందన్న అభిప్రాయానికి వస్తున్నారు.
వైసీపీలో చేరిపోయి ఉంటే కన్నా మినిస్టర్ రేంజ్లో ఉండేవారుగా..!?
కన్నా లక్ష్మినారాయణ పదవీ కాలం.. ముగిసింది. అయితే.. సహజంగా రెండో సారి పొడిగింపు ఇస్తూ ఉంటారు. కన్నా లక్ష్మినారాయణ లాంటి నేతకు ఇవ్వాలి. ఎందుకంటే.. బీజేపీలో ఉంటే.. ఎలాంటి గెలుపులు… పదవులు రావని తెలిసి కూడా.. అమిత్ షా ఒత్తిడి మేరకు ఆయనపార్టీలో ఉన్నారు. లేకపోతే.. ఎన్నికలకు ముందే.. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంటి ఎదుట బ్యానర్లు కూడా మార్చుకున్నారు. చివరి క్షణంలో అమిత్ షా భరోసా ఇవ్వడంతో…” ఆస్పత్రి డ్రామా “ను సీన్లోకి తెచ్చి.. పొలిటికల్ సీన్ మార్చేసుకుని ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఒక వేళ అప్పట్లో ఆయన అమిత్ షాను కాదని.. వైసీపీలో చేరి ఉన్నట్లయితే.. ఇప్పుడు ఖచ్చితంగా సామాజికవర్గ పరంగా చూసుకున్న మంత్రి పదవిలో ఉండే వారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు.. ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఊడిపోయింది.
రేసులోనే లేని సోము వీర్రాజుకు పీఠమెలా..?
నిజానికి సోము వీర్రాజు పేరు అసలు ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ప్రచారంలోనే లేదు. యువనేతలు.. కొత్త సామాజిక సమీకరణాలపై.. బీజేపీ అగ్రనేతలు దృష్టి సారించారని చెప్పుకున్నారు. ముఖ్యంగా విశాఖ ఎమ్మెల్సీ… యువనేత… బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపే సామాజికవర్గానికి చెందిన మాధవ్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ సారి రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలన్న డిమాండ్‌తో.. విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా.. ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరే గట్టి పోటీదారులని అనుకున్నారు. బీజేపీ భవిష్యత్ దృష్ట్యా యువ నాయకత్వానికి ఇస్తే.. బలోపేతం అవడానికి అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం వేరేలా ఆలోచించింది.
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నందునే యువనేతలను పక్కన పెట్టారా..?
ప్రస్తుతం బీజేపీలో వైసీపీకి అనుకూలం… వైసీపీకి వ్యతిరేకం అనే రెండు వర్గాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో వైసీపీకి వ్యతిరేకం అనే వారి నేతల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతకు కారణం అవడమే కాదు.. ఏ ఒక్క బీజేపీ నేతనూ.. గౌరవించని పరిస్థితి ఉండటంతో.. వైసీపీతో దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. అందుకే.., ఎప్పుడూ లేని విధంగా… ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీజేపీ నేతల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కన్నాతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ అందరూ వైసీపీ విధానాలను విమర్శిస్తున్నారు. మూడు రాజధానులనూ వ్యతిరేకిస్తున్నారు. వీరందర్నీ.. హైకమాండ్ సైడ్ చేసేసింది.
వైసీపీ అనుబంధ విభాగంగా బీజేపీ మారిపోవడం ఖాయమా..?
ప్రస్తుతం బీజేపీలో వైసీపీకి ఔట్‌రైట్‌గా మద్దతుగా ఉంటున్న నేత సోము వీర్రాజు మాత్రమే. ఇటీవలి కాలంలో ఆయన ప్రెస్మీట్లు చూస్తే సులువుగానే అర్థమయిపోతోంది. పోలవరంలో ఎలాంటి అవినీతి లేదని కేంద్రం ప్రకటించిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన సోము వీర్రాజు… అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలోనే అవినీతి జరిగిందన్నారు. ఓ సారి జగన్ ను ఆయన ఇంట్లో కలిసి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ప్రశంసల వర్షం కురిపించారు. మూడు రాజధానుల్ని సమర్థించారు. అమరావతిపై వైసీపీ నేతలు చేసిన స్మశానం వ్యాఖ్యలను అటూ ఇటూగా తానూ చేస్తూంటారు. ఎలా చూసినా.. సోము వీర్రాజు.. వైసీపీ చాయిసేనని.. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్.. తమ పార్టీ ప్రయోజనాల కన్నా… వైసీపీకి ఇబ్బంది లేకుండా.. చూడటానికే ప్రాధాన్యం ఇచ్చిందనే చర్చ బీజేపీలోనే ప్రారంభమయింది.