వైఎస్ జగన్మోహనరెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈ ఒత్తిడిలో ఆయన ఒక తప్పు తర్వాత మరో తప్పు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఒక నష్టం తర్వాత.. మరో నష్టానికి దారితీసే నిర్ణయాల దిశగా పార్టీని నడిపిస్తున్నట్లుగా అభిప్రాయం కలుగుతోంది. తాజాగా భూమా నాగిరెడ్డి కుటుంబం మరియు అనుచరుల సహా తెలుగుదేశం పార్టీలో చేరకుండా ఆపడానికి, తన పార్టీలో సీనియర్ నాయకులను రాయబారాలకు పంపుతున్న జగన్మోహనరెడ్డి ఈ విషయంలో కూడా మరో తప్పిదం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ తరఫున విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి భూమాతో రాయబారానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఈ రాయబారాలు ఫలించకపోతే గనుక.. వైకాపాకు మరింత పరువునష్టమే తప్ప లాభం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితిని జగన్ స్వయంగా కొనితెచ్చుకున్నారనే అనుకోవాలి. ఎందుకంటే.. వైకాపా ఎమ్మెల్యేలకు గేలం వేయడం తెదేపా ఎప్పటినుంచో చేస్తున్నప్పటికీ.. అందుకు సంబంధించి ముహూర్తాల విషయంలో వారు తొందరపడలేదు. కానీ జగన్ రెండు రోజుల కిందట తనకు 21 మంది తెదేపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, తాను తలచుకుంటే చంద్రబాబు సర్కార్ గంటలో కూలుతుందని ప్రకటించడం వారికి కాస్త వేడిపుట్టించింది. ఆ వ్యాఖ్యల్ని వారు సీరియస్‌గా తీసుకున్నారు. నిజానికి ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్ లాంటి వాళ్లను తెదేపాలో చేర్చేసుకోవడం వారికి చిటికెలో పని. కానీ.. ఎప్పటినుంచో వారి పేర్లు నానుతున్న నేపథ్యంలో దాని వల్ల జగన్‌కు పెద్దగా కలిగే షాక్ ఏమీ లేదు. అందుకే భూమా ఫ్యామిలీ మీద ఫోకస్ పెంచారు. అది ఒక కొలిక్కి వచ్చేసింది. ఆయన రేపు తెదేపాలో చేరడం దాదాపుగా ఖరారు అవుతున్నది.
భూమాను బుజ్జగించే విషయంలోనూ జగన్ మీనమేషాలు లెక్కించి, పరిస్థితి చేయిదాటిపోయే దాకా ఊరుకున్నారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. భూమా ఫిరాయింపు గురించి రెండు రోజులుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ రెండు రోజులూ జగన్ తరఫు రాయబారులు మిన్నకుండిపోయి, తీరా కర్నూలు ఆయన ఇంటిమీదనుంచి వైకాపా జెండాలనుకూడా దించేసిన తర్వాత.. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్లి మంతనాలు సాగించడం అనేది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాంటిదే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైకాపా కీలక నాయకులు వెళ్లి భూమాతో మంతనాలు చేయవచ్చు గాక.. కానీ పార్టీ మారాలనే ఆయన నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గుతారని అనుకోవడం భ్రమ. ఈ రకంగా కొత్తగా వైకాపా పరువు పోగొట్టుకోవడం తప్ప దక్కేదేమీ ఉండదు. ఒకవేళ బుజ్జగింపులు సక్సెస్ అయితే… చంద్రబాబుకు అంతకు మించిన షాక్ ఉండదు.