చేతికి అంటింది ముక్కుకు అంటించుకున్న చందంగా ..వైసీపీ మూడు రాజధానులపై ఉద్యమ వ్యూహం అమలవుతోంది. సీఎంను మెప్పించడానికో లేకపోతే తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమో కానీ విశాఖకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా ప్రకటనలు చేశారు. కరణం ధర్మశ్రీ చెల్లని రాజీనామా చేసి మరింత రచ్చ చేశారు. మిగతా వారు కూడా తాము రెడీ అంటున్నారు కానీ..పై నుంచి ఆర్డర్స్ రావాలన్నారు. కానీ హఠాత్తుగా మాట మార్చేశారు. మేమెందుకు రాజీనామాలు చేయాలంటున్నారు.
మూడు రాజధానుల కోసం మొత్తం రాజీనామాలు చేయాలని .. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఒక్క వైసీపీనే కాదు .. తాము కూడా రాజీనామా చేస్తామని అంటోంది. అసలు మూడు రాజధానులపై రిఫరెండం పెట్టుకుందామని.. ఎన్నికలకు వెళదామని చంద్రబాబనాయుడు ఎన్ని సార్లు చాలెంజ్ చేశారో లెక్కే లేదు. అచ్చెన్నాయుడు అనేక సార్లు ఈ అంశంపై ఎన్నికలకు వెళదామని.. ఓడిపోతే టీడీపీని మూసేస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. కానీ ఒక్క వైసీపీ నేత కూడాముందుకు రాలేదు. టీడీపీ వాళ్లే రాజీనామా చేయాలని ఎదురుదాడికి దిగి సైలెంట్ అయ్యారు. అయితే ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టాలన్న వ్యూహమో.. మరొకటో కానీ వారే రాజీనామాల అంశాన్ని తెరపైకి తెచ్చారు.
కరణం ధర్మశ్రీ జేఏసీకి రాజీనామా పత్రం ఇవ్వగానే.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తాయనుకున్నారు. కానీ ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు గతంలో తాము అమరావతికే మద్దతని చెప్పామని ఇప్పుడు కూడా అదే చెబుతామని..అమరావతికి మద్దతు ప్రకటించి ఇప్పుడు మూడు రాజధానులని మాట మార్చింది మీరే కాబట్టి రాజీనామాలు చేయాలని అంటున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నది ఒక్క ఎమ్మెల్యేనేనా అన్న సెటైర్లు కరణం ధర్మశ్రీ రాజీనామా లేఖ ఇచ్చినప్పటి నుండి వచ్చాయి. మిగిలిన వారందరూ అమరావతికి మద్దతు ఇచ్చినట్లేనా అన్న విశ్లేషణలు చేశారు. ఈ పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరంగా మారింది.
ఈ రాజీనామాల వేడిని తగ్గించకపోతే.. వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాల కోసం మూడు ప్రాంతాల్లోడిమాండ్లు పెరిగిపోతాయన్న ఆందోళనతో ఒక్క సారిగా యూటర్న్ తీసుకున్నారు. దీంతో వైసీపీ ముందుగానే ఓడిపోయినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.