తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నికపై అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా దృష్టి పెట్టాయి. ఐదు లక్షల మెజార్టీని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న సామాజివర్గాల సమీకరణ వైసీపీకి వరంగా మారింది. ఈ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో కలిపి 20.92 శాతం ఎస్సీలు, 9.65 శాతం ఎస్టీలు ఉన్నారు. ఇక మైనార్టీలు 7.18 శాతం అంటే మొత్తం 37.75 శాతం ఓట్లు ఈ మూడు వర్గాల వారు ఉన్నారు.
గత ఎన్నికల్లో ఈ మూడు వర్గాల్లో 80 నుంచి 90 శాతం వరకు ఓట్లు వైసీపీకి అండగా పడ్డాయి. ఇప్పటికి వీరందరూ ఆ పార్టీకి ఓటు బ్యాంక్‌గానే ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా వీరికే ఎక్కువగా అందుతున్నాయి. దీంతో ఈ సారి కూడా తమకు పెద్ద ఎత్తున ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. వీటి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకునేందుకు వైసీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ అధికార పార్టీ నేతలకు కొన్ని చిక్కులు వస్తున్నాయి. తాము పార్టీకి చెందిన వారమైనా తమకు ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదన్న అసంతృప్తి కొన్ని వర్గాల్లో ఉంది. వారికి అర్హత లేకపోవడం కారణంగా ఇవ్వలేకపోతున్నారు. కానీ.. ఇతరులకు ఇచ్చి తమకు ఇవ్వకపోవడం.. వారిని అసంతృప్తికి గురి చేస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు… మైనస్‌లు ఉంటాయి. ప్లస్‌లూ ఉంటాయి. తిరుపతి ఉపఎన్నికల్లో ప్లస్‌లను వైసీపీ సమర్థంగా వినియోగించుకోగలిగితే.. అనుకున్నంత మెజార్టీ వస్తుంది. అయితే ఇతర వర్గాల్లో ఉన్న అసంతృప్తిని వీలైనంత వరకూ తగ్గించే ప్రయత్నం చేయాల్సి ఉంది. ఆ పనిలోనే.. వైసీపీ నేతలు తిరుపతిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి సారధ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మంత్రి పదవి నిలబెట్టుకోవాలంటే ముఖ్యమంత్రి ఇచ్చిన టాస్క్‌ను ఆయన కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన కూడా కష్టపడుతున్నారు.