వైసీపీ మ్యానిఫెస్టో పై సీఎం జగన్ కసరత్తు పూర్తి చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న నవరత్నాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను ప్రవేశ పెట్టనున్నామని మీడియాకు లీకులిస్తున్నారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అమలు చేస్తామని అంటున్నారు. వీటి గురించి వింటే వైసీపీ నేతలే ఉలిక్కి పడుతున్నారు.
ఒక్క అబద్దం చెబితే తనకు పదవి వచ్చదని.. ఆ అబద్దం రుణమాఫీ అని….రైతులకు రుణమాఫీ చేయలేమని జగన్ 2014ఓటమి తర్వాత చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క అబద్దం చెప్పి మళ్లీ గెలవాలని అనుకుంటున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక డ్వాక్రా రుణమాఫీ కూడా అంతే. ప్రతీ డ్వాక్రా మహిళకు రూ. 50వేల రుణమాఫీ చేస్తామని నవరత్నాల్లో హామీ ఇచ్చారు. కానీ.. ఒక్కొక్కరికి ఇరవై వేలు కూడా ఇవ్వలేదు. అదీ ఐదేళ్లలో. ఇక మళ్లీ డ్వాక్రారుణాల మాఫీ అంటే ఎవరైనా నమ్ముతారా ?
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం.. ఓట్లను కురిపించే పథకాలుగా కనిపిస్తున్నాయి. వాటిని తాము అమలు చేస్తామని ప్రకటిస్తే..టీడీపీ మేనిఫెస్టోకు మరింత ప్రచారం ఇచ్చినట్లవుతుంది. అందుకే.. వాటి జోలికి వెళ్లాలని వైసీపీ అనుకోవడం లేదు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలన్నీ రద్దవుతాయని బెదిరించే స్ట్రాటజీని మాత్రం అమలు చేయనున్నారు. ఇలా బెదిరించడమే ఓడిపోతున్నారడానికి మొదటి సూచన అని ప్రజల్లో ఇప్పటికే చర్చ ప్రారంభమయింది.