విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు.. రెండే రెండు అత్యంత ముఖ్యమైన విషయాలు. ఒకటి పోలవరం. రెండు రాజధాని. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే.. వర్షాభావం ఉన్నా… ఏపీ నలుమూలలా… సాగునీటికి కావాల్సిననన్ని నీరు అందుబాటులోకి వస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. ఇక రాజధాని… చుట్టపక్కల రాష్ట్రాలు..మెగా రాజధానిని కలిగి ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఎవరైనా ఉపాధి అవకాశాలు అక్కడికి పోవాల్సిన పరిస్థితి. సొంత రాష్ట్రంలో.. అలాంటి ఉపాధి అవకాశాల గనిని ఏర్పాటు చేసుకోవాలంటే… ప్రజారాజధాని ముఖ్యం. చంద్రబాబు ఈ రెండింటిపై దృష్టి పెట్టి పనులు చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం.. వీటి విషయంలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు. చివరికి మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు.
ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి రాజాధానిపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించలేదు. రాజధాని అమరావతి కొనసాగిస్తారా..? మారుస్తారా అన్నది స్పష్టం చేయలేదు. వైసీపీ మేనిఫెస్టోలో రాజధాని నిర్మాణంపై ఎటువంటి ప్రస్తావన లేకుండా వదిలేశారు. నేటివరకు గ్రాఫిక్స్, తాత్కాలిక నిర్మాణాలు మినహా అమరావతిలో ఏం జరగలేదని చెబుతున్న వైసీపీ.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం .. ప్రణాళిక ఏమిటనేది చెప్పలేకపోయారు. అంటే రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకే వైసీపీ ప్రయత్నిస్తుందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. విభజన చట్టంలో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అంటే రాయలసీమ, ఉత్తరాంధ్రలో అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ ని అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ఏం చేస్తారనే అంశంపై మేనిఫెస్టోలో ప్రస్తావించలేదు. ఇక రాష్ట్ర రైతాంగానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ తోపాటు కీలకమైన జలవనరుల శాఖ అంశంపై తమ పార్టీ విధివిధానాలేమిటో ప్రకటించలేదు. కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన జలయజ్ఞం కొనసాగిస్తామని చెప్పటం మినహా, ప్రత్యేకంగా సాగునీటి ప్రాజెక్ట్ లపై వైసీపీ విధానం ఏమిటో చెప్పలేదు.
గ్రామానికి పదిమందిని వెంటనే అదే గ్రామంలో నియమిస్తామని చెప్పటంపై పెద్ద ఎత్తున సందేహాలు ముసురుకున్నాయి. ఇప్పటివరకు గ్రామాల్లో ఉన్న వీఏవో, ఆర్వో వ్యవస్థలను రద్దు చేస్తారా అని చర్చ గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయింది. పారిశ్రామిక విధానం, పెట్టుబడులు ఎలా తీసుకొస్తాము అనే అంశాలపై ఎటువంటి స్పష్టత వైసీపీ మేనిఫెస్టోలో కన్పించలేదు. పూర్తిగా ఓట్ల వేట కోసం పథకాల్ని పెట్టడం తప్ప.. రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేస్తారన్న విషయం.. మేనిఫెస్టోలో లేదు.