ఫ్యాక్టరీలన్నింటికీ ఆదేశాలు వెళ్లాయి..! …
లారీల కాంట్రాక్టులు మొత్తం రద్దు చేసుకుని.. తాము చెప్పిన వారికే లారీల కాంట్రాక్టులివ్వాలని..!
మేనేజర్లందరికీ హెచ్చరికలు వెళ్లాయి…!
ఉద్యోగాల్లో పాత వారిని తీసేసి.. తాము చెప్పిన వారినే పెట్టుకోవాలని..!
కాంట్రాక్టర్లకూ… వార్నింగులు వెళ్లాయి..!
పనులు చేయాలంటే.. కప్పం కట్టాల్సిందేనని..!
ఇదంతా అనంతపురం జిల్లాలో ప్రస్తుతం కళ్ల ముందు జరగుతున్నవే. కియా మేనేజర్ పోలీసులకు చేరిన ఫిర్యాదు వెనుక… తాడిపత్రిలో లారీల కాంట్రాక్టుల వెనుక… అనంతపురంలో ఆగిపోయిన అభివృద్ధి పనుల వెనుక.. ఈ “పాలనా పరమైన సంస్కరణ” ఉంది. ప్రభుత్వం మాది కాబట్టి… తాము చెప్పిన రేట్లను.. పనులను ఫిక్స్ చేయాల్సిందేనంటున్నారు వైసీపీ నేతలు. పై స్థాయి నుంచి .. కింది స్థాయి నేతల వరకూ… ఇదే తరహా పాలన సాగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.
మూడు రోజుల కిందట.. ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతలు తమ పార్టీకి చెందిన వారికే ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వాలని సీమెన్స్- గమేషా సంస్థ ప్రతినిధులకు హుకుం జారీ చేశారు. తమ నేతతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలని హెచ్చరికలు జారీచేశారు. వాహనాల సరఫరా కాంట్రాక్టుతో పాటు సెక్యూరిటీ గార్డు కాంట్రాక్టును తమకే కేటాయించాలని ఒత్తిడికి గురిచేశారు. గత ప్రభుత్వంలో తీసుకున్న ఉద్యోగులు, కాంట్రాక్టర్లను వెంటనే తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు యాజమాన్యానికి సమాచారం ఇచ్చి అనంతపురం నుంచి పరారైపోయారు.
గత ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలు వచ్చాయి. కియా తో పాటు అనుబంధ సంస్థలు అలాగే.. పవన విద్యుత్ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ సంస్థల యజమానులకు… వైసీపీ నేతలు బెదిరించడం ప్రారంభించారు. పరిశ్రమల్లో కాంట్రాక్ట్ పనులు ఉద్యోగాలు తమ వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పవన విద్యుత్ సబ్ స్టేషన్లు మూసి వేయాలంటూ కార్యాలయం ముందు గొడవలకు దిగుతున్నారు. ప్రతీ రోజా… వైసీపీ నేతలు సెటిల్మెంట్ల పేరుతో.. పారిశ్రామికవేత్తలను వేధిస్తూనే ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
బెదిరింపులకు గురవుతున్న పారిశ్రామికవేత్తలు పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం ఉండటం లేదు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారు. నోటి మాటగా చెబితే.. పోలీసులు రాతపూర్వకంగా ఇస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. తెర వెనుక మాత్రం… వైసీపీ నేతలతో సెటిల్ చేసుకోమని సలహాలిస్తున్నారు. ఓ రకంగా… బెదిరింపులు.. దందాలతో.. అనంతపురం రాజకీయం.. ప్రతి నియోజకవర్గం… ఓ మినీ సామ్రాజ్యంగా మారిపోయింది. వైసీపీ గెలిస్తే ఎలాంటి పాలన వస్తుందని.. టీడీపీ నేతలు చెబుతూ వచ్చారో… అలాంటి బ్రాండ్ ను.. వైసీపీ నేతలు అనంతపురంలో మొదటగా సాక్షాత్కరింప చేస్తున్నారు.