నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశామని.. లీడర్లందరికీ… అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేశామని.. వైసీపీనేతలు హోరెత్తిస్తున్నారు. కానీ పదవుల్లో ఉన్న అసలు విషయం వెలుగు చూసిన తర్వాత వైసీపీలోనే ..ఇంత మోసపోయామా అని ఇతరులు నోరెళ్లబెట్టక తప్పడంలేదు. ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో అత్యంత కీలకమైన పదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికే ఇచ్చేశారు. ఏపీలో రాష్ట్ర స్థాయి పదవులుగా.. కాస్త పలకుబడి ఉన్న పదవులుగా చెప్పుకునే కార్పొరేషన్లు వేళ్ల మీద లెక్కబెట్టేవి ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ ఐఐసీ, ఏపీఎస్ఆర్టీసీ, టూరిజం కార్పొరేషన్, పౌరసరఫరాల సంస్థ, ఆప్కాబ్, మార్క్ ఫెడ్, శాప్ వంటి కార్పొరేషన్లు ప్రధాన పదవులుగా భావిస్తారు. వీటన్నింటినీ ఒకే సామాజికవర్గానికి ఇచ్చేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం.. అసలు విధులు.. నిధులు ఉండని.. ఇంకా చెప్పాలంటే.. అలాంటి కార్పొరేషన్లు ఉంటాయని ఇప్పటి వరకూ చాలా మందికి తెలియని పదవులను కేటాయించాయి. స్మార్ట్ సిటీ కార్పొరేషన్లు అనేవే లేవు. కానీ పదవులు ఇచ్చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని ప్రకటించారు. కానీ.. ఆర్టీకి చైర్మన్‌ను సీఎం సమీప బంధువును నియమించారు. రీజనల్ డైరక్టర్లుగా కూడా నియమించారు. అసలు ఇప్పటి వరకూ అలాంటి పదవులు పొందగలిగే కార్పొరేషన్ ఉందని.. కూడా తెలియనివారికి ఆ కార్పొరేషన్లలో పదవులు వచ్చాయి. పొరుగు సేవల కార్పొరేషన్.. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ వంటి పదవుల్ని కూడా పందేరం చేశారు. వీటన్నింటినీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించారు.
ఈ నామినేటెడ్ పదవులపై వైసీపీలోనే రచ్చ ప్రారంభమయింది. ఏదో ఓ పదవి దక్కిందని కొంత మంది సంతోషపడుతున్నారు కానీ.. చాలా మంది అసలు కార్యాలయం కుర్చీ లేకుండా.. కేవలం పదవి ఉందని చెప్పుకోవడానికి మాత్రమే పనికి వచ్చే పదవులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అత్యంత కీలకమైన పదవుల్లో .. ఎవరికీ చాన్సివ్వకుండా.. ఒక్క సామాజికవర్గానికే కట్టబెట్టి.. కేవలం బడుగు, బలహీనవర్గాలకు ఎక్కువ ఇచ్చామని చెప్పుకోవడానికి లేని కార్పొరేషన్లు.. డమ్మీ చైర్మన్ పదవులు ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే.. వైసీపీ స్ట్రాటజీ మొదటి నుంచి అదే. ఐదుగురుకి డిప్యూటీ సీఎంలు ఇచ్చినా.. ఇద్దరికి డిప్యూటీ మేయర్ పదవులు ఇచ్చినా.. అసలు ఒక్క రూపాయి నిధులివ్వకుండా.. కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా… వైసీపీ మార్క్ అంతే అనుకోవాలి. ఈ పదవులు కూడా అంతే..!