ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడా ఉందా ? లేకపోతే ఎప్పట్లా వైసీపీ రాజ్ కొనసాగుతుందా అన్న డౌట్ .. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో ఎవరికైనా వస్తుంది. కోడ్ వచ్చిందన్న మాటలే కానీ.. ఇసుమంత కూడా మార్పు కనిపించలేదు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు చెందిన చీరలు స్వాధీనం చేసుకున్నారంటే.. అధికారులు చురుకుగా పని చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అంతర్గతంగా ఎలాంటి హెచ్చరికలు వచ్చాయో కానీ అంతా సైలెంట్ అయిపోయారు. చివరికి టీడీపీ నేతల వాహనాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ సోదాలు చేయడమే కోడ్ అమలు చేయడం అన్న పరిస్థితికి వచ్చారు ?
హత్య, హింసాకాండలు జరిగినా సంబంధింతులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. 2019 తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండి ఎన్నికలు నిర్వహించినప్పుడు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పు చేయకపోయినా… చివరికి వివేకా కేసు దర్యాప్తున్న ఎస్పీని ఈసీ బదిలీ చేసింది. ఆ కేసు షెడ్డుకెళ్లేలా చేసింది. అలాంటి పవర్ ను అప్పట్లో వాడుకున్న ఈసీ అధికారులు ఇప్పుడు మాత్రం చూసీ చూడనట్లుగా ఉంటున్నారు. స్వయంగా ప్రధాని సభకు రక్షణ బాధ్యతలు తీసుకున్న ముగ్గురు ఎస్పీల నిర్లక్ష్యం బయటపడింది.. వారి జిల్లాల్లో నిరంతరం హింస జరుగుతోంది.. అయినా చర్యలు మాత్రం శూన్యంగా మారాయి.
ఈసీ చర్యలు తీసుకోదన్న అభిప్రాయంలో బరి తెగించే అధికారులు పెరిగిపోతున్నారు. ఫలితంగా ఎన్నికల కోడ్ అపహాస్యం అవుతోంది. చివరికి తమ భూమిని అక్రమంగా ఆన్ లైన్ చేసుకున్నారని ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే.. అక్కడి డీఎస్పీ ఏ మాత్రం మానవత్వం లేకుండా ప్రెస్ మీట్ పెట్టి… చనిపోయిన వాళ్లు.. బెట్టింగ్లకు, మద్యానికి వ్యసనపరులని.. వారికి భూమి లేదని అడ్డగోలుగా వాదించారు. ఇలాంటివి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇక వాలంటీర్లు… ఇతర ప్రభుత్వ చిరుద్యోగులను వైసీపీ నేతలు ఎలా వాడుకుంటున్నారో చెప్పాల్సిన పని లేదు. కఠినమైన నిర్ణయం తీసుకుంటే అందరూ దారిలోకి వస్తారు. అలాంటి పనులేమీ చేయడం లేదు.
ఏపీలో ఉన్న అధికారుల్లో అత్యధికులు ఒకే సామాజికవర్గం వారు. ఎన్నికల నిర్వహణ వారి చేతుల మీదుగా సాగాలని వారిని నియమించారు. సీఎం, సీఎస్, డీజీపీ సహా ఎస్పీలు, కలెక్టర్లు అత్యధికులు ఒకే వర్గం వారు. వేరే వారు ఉన్న చోట.. వారిని నియంత్రించడానికి ఆ వర్గం వారిని పెట్టారు. వీటన్నింటినీ ఈసీ ఎప్పుడు న్యూట్రల్ స్థితికి తెస్తుందో కానీ… ఇప్పటికైతే ఏపీలో ఎన్నికల కోడ్ అనేది లోకేష్ వాహనాలను తనిఖీ చేయడానికే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.