వైయస్ఆర్ సీపీ నేత జగన్ పాదయాత్ర ముగిసిన తరువాత హఠాత్తుగా జగన్ పార్టీ బలం గా మారిపోయినట్టు, జగన్ గెలవడం ఇక కేవలం లాంఛనమే అన్నట్టు ఇటు వైఎస్ఆర్సిపి అభిమానులు, అటు సాక్షి తో పాటు జగన్ కి వత్తాసు పలికే కొన్ని మీడియా సంస్థలు ప్రచారాన్ని ప్రారంభించారు. పైగా కొంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్ లు, అలాగే కాంగ్రెస్ పార్టీలో గత ఐదేళ్లుగా సుషుప్తావస్థలో ఉన్న లీడర్లు వైఎస్సార్సీపీలో చేరడంతో, జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అర్థం అయ్యింది కాబట్టే వీరందరూ వైఎస్ఆర్ సీపీ లో చేరుతున్నారు అంటూ సాక్షి తో పాటు జగన్ కి వత్తాసు పలికే మీడియా సంస్థలు కొత్త పాట మొదలెట్టారు. అయితే క్షేత్రస్థాయిలో జగన్ బలం ఏంటి అన్నది అర్థం కావాలంటే ఒకసారి 2014 ఎన్నికల ఫలితాల నుంచి మొదలుపెట్టాలి.
ఆ 8 జిల్లాలోని 115 సీట్లలో జగన్ గెలిచింది 26 సీట్లలోనే
శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా ఉన్న ఏడు జిల్లాల్లో దాదాపు 101 సీట్లు ఉన్నాయి. అలాగే రాయలసీమలోని అనంతపురం లో 14 సీట్లు ఉన్నాయి. అంటే ఈ 8 జిల్లాలలో కలిపి 115 నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ 115 లో వై ఎస్ ఆర్ సి పి 2014 లో గెలిచింది కేవలం 26 సీట్లలోనే. అంటే సుమారుగా 89 స్థానాల్లో జగన్ పార్టీ బలహీనంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 స్థానాలలో జగన్ కి వచ్చిన సీట్లు నిండు సున్నా.
2014లో ఈ ఎనిమిది జిల్లాల్లో వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి:
జగన్ కి నిద్ర లేకుండా చేస్తున్న 8 జిల్లాలు
అయితే 2014 లో వచ్చిన ఫలితాలే మళ్లీ 2019లో రావాలని లేదు. ఈ జిల్లాలోని కొన్ని స్థానాలలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. జగన్ కూడా ఈ జిల్లాల్లో కేవలం ఈ ప్రభుత్వ వ్యతిరేకత ని నమ్ముకుని ఉన్నాడు. కానీ మరొకలాగ చూస్తే, 2014 ఎన్నికల సమయానికి జగన్ కి కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. ఒకటి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పోటీ చేసిన మొదటి ఎన్నికలు అన్న సానుభూతి అప్పటికి ఇంకా సజీవంగా ఉంది. పైగా రాష్ట్రంలో కేవలం రెండు గ్రూపులు పోటీ పడ్డాయి. తెలుగుదేశం బి.జె.పి పవన్ కళ్యాణ్ కలిసిన గ్రూపు ఒక వైపు ఉంటే, వైఎస్ఆర్సిపి మరొక వైపు ఉంది. ఇలాంటి ద్విముఖ పోటీలోనే జగన్ ఈ 115 స్థానాల్లో 26 సీట్లకు మించి తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన , బిజెపి , కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి అన్ని విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఈ బహుముఖ పోటీ లో ఖచ్చితంగా ఓట్లు విడిపోతాయి. మరి అలాంటి పరిస్థితుల్లో జగన్ తన మునుపటి బలమైన 26 సీట్లు అయినా నిలబెట్టుకుంటారా అన్నది సందేహంగా మారింది.
ఈ 90 నియోజక వర్గాలలో పట్టు కోసమే టిఆర్ఎస్ తో జనసేన పై ఒత్తిడి:
అయితే 2014 లో తన ఫలితాన్ని తారుమారు చేసిన ఈ 90 నియోజకవర్గాల్లో పట్టు కోసమే జగన్ పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం ప్రయత్నించారు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ 90 నియోజకవర్గాల్లో 2014 తో పోలిస్తే జగన్ కొత్తగా బలపడింది ఏమీ లేదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో పరిస్థితి చేయి జారకముందే ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో జగన్ టీఆర్ఎస్ నేతల ద్వారా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెప్పించి తనతో చేయి కలపాల్సిందిగా కోరినట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఇప్పటిదాకా జగన్ గానీ, వైఎస్సార్సీపీ నేతలు కానీ సాక్షి గానీ గట్టిగా ఖండించింది లేదు. దీంతో ప్రజల్లో కూడా జగన్ టీఆర్ఎస్ నేతల ద్వారా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకు వచ్చారని బలంగా నమ్ముతున్నారు. నిజంగా జగన్ అంత బలంగా ఉండి, ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం అంత ఆరాటపడి ఉండేవారు కాదని, పవన్ తో పొత్తు కోసం అంత ఆరాటపడడం చూస్తుంటే ఈ 8 జిల్లాలోని ఆ 90 స్థానాలు జగన్ కి నిద్ర పట్టనివ్వడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరి గండాన్ని గట్టెక్కడం ఎలా?
అయితే పవన్ కళ్యాణ్ జగన్ తో పొత్తుకు ససేమిరా అనడంతో , ఇక చేసేదేమీ లేక కొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టారు జగన్. సాక్షి పత్రికలో ఏమో పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకోబోతున్నారని, పవన్ కళ్యాణ్ కి 25 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు చంద్రబాబు ఇస్తున్నారని ఒక కథనం రాసుకొచ్చారు. ఈ కథనం ఒకరకంగా చూస్తే అటు జగన్ ఇటు సాక్షికి సెల్ఫ్ గోల్ లా మారింది. ఈ కథనం ఆశించిన ఫలితాన్ని రాబట్టడంలో దారుణంగా విఫలం అవడంతో, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండాను పూర్తిగా పీకేయబోతున్నారంటూ కొత్త కథనం మొదలు పెట్టారు జగన్ కి వత్తాసు పలికే మీడియా సంస్థలు.
ఇటువంటి స్ట్రాటజీలు 2009లో సత్ఫలితాలను ఇచ్చి ఉండవచ్చు కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువ. సాక్షిలో కథనం వచ్చాక అటు పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద అభిమానం ఉన్నవారు కానీ, ఇటు మెగా అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ కి చెందిన సామాజిక వర్గం వారు కానీ, మరీ ఇంత దుష్ప్రచారం ఏంటి అంటూ సాక్షిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఏ 89 స్థానాల్లో పట్టు కోసం అయితే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారో, ఆ 89 స్థానాల్లో వైయస్సార్సీపి ఇటువంటి కథనాల కారణంగా మరింత బలహీనపడింది.
ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావాలంటే కనీసం 88 స్థానాల్లో ఏ పార్టీ అధినేత అయినా గెలవాల్సి ఉంది. 2014లో జగన్ కి షాక్ ఇచ్చిన ఈ 90 స్థానాలలో ఓడిపోతే మిగిలిన 85 స్థానాలకు 85 గెలిచినప్పటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి జగన్ 8 జిల్లాలోని ఆ 115 స్థానాలలో కొంచెమైనా మెరుగైన ఫలితాలను సాధించకపోతే మరొకసారి ముఖ్యమంత్రి కావాలన్న జగన్ జీవిత ఆశయానికి గండి పడ్డట్టే.