అటు కడప జిల్లానుంచి, లేదా కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన లీకులు నిజమైతే కర్నూలు జిల్లానుంచి వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి ఫిరాయించడం ఉంటుందేమో అని అందరూ ఎదురుచూస్తూ ఉండగా.. అనూహ్యంగా నెల్లూరు రాజకీయాలు అలాంటి కబురును తెరమీదకి తెచ్చాయి. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వైకాపా ఎమ్మెల్యే సునీల్ తెలుగుదేశంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తమ జిల్లాకే చెందిన కీలక మంత్రి నారాయణతో ఇదివరలోనే మంతనాలు జరిపి.. మొత్తం తన చేరికకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే సునీల్.. మంగళవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత.. చంద్రబాబునాయుడును కూడా కలిసి పార్టీలో చేరికను ఖరారు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఇవాళో రేపో కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపానుంచి తెదేపా తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మంగళవారం నాడు డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రెస్మీట్ పెట్టి మరీ.. మరో నలుగురు ఎమ్మెల్యేలు తెదేపాలోచేరబోతున్నారనే కబురును మీడియా ముఖంగా లీక్ చేశారు. కర్నూలు జిల్లానుంచి ఇంకా తెదేపాలోకి వచ్చే వికెట్లు ఉన్నాయనే పుకార్లు నడుస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన అగ్రనేత కేఈ ప్రకటన.. కడప కర్నూలు జిల్లాల వారి గురించి అని అంతా లెక్కలు వేశారు.
అయితే అనూహ్యంగా నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే చంద్రబాబును కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం ఆసక్తికరం. అయితే అభిజ్ఞ వర్గాలనుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. నెల్లూరు జిల్లాలోనే మరికొందరు వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి బలమైన దన్నుగా నిలిచిన వారు కూడా తెదేపాలో చేరిక కోసం మంచి ముహూర్తాలు వెతుకుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.