జగన్ కు ఆత్మీయ స్నేహితుడినని చెప్పుకున్న నాగార్జునపైనా వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. ఆయనను ఎలాగైనా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి ఒప్పించాలన్న ప్రయత్నాలు చేస్తోంది. గతంలోనే ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ నాగార్జున సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం విజయవాడలో గట్టిపోటీ ఇవ్వాలంటే నాగార్జున లాంటి స్టార్ అవసరమని భావిస్తున్నారు. దీంతో నాగార్జున పోటీకి అంగీకరించారని కొన్ని ప్రో వైసీపీ సోషల్ మీడియాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు.
కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లలోనూ లీకులు ఇప్పించారు. అయితే నాగార్జున తీరు చూస్తే ఆయన రాజకీయాలకు అంటీ ముట్టనట్లే ఉన్నారు. ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. జగన్ తో అయినా ఇతరులతో అయినా పరిచయాల్ని వ్యక్తిగత స్నేహం వరకే ఉంచారు కానీ రాజకీయాల వరకూ తీసుకు రాలేదు. నొప్పింపక తానొవ్వక అంటూ తప్పించుకు తిరుగుతున్నారు.గత ఎన్నికల్లో వైసీపీకి ఆయన చేసిన సాయం గురించి రాజకీయవర్గాలు కథలు కథలుగా చెప్పుకుంటాయి. కానీ ఆయన మాత్రం నేరుగా వైసీపీకి మద్దతు ప్రకటించలేదు.
ఇప్పుడు ఆయనను ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మీడియా ద్వారా లీకులిచ్చి.. ఆ తరవాత వైసీపీ హైకమాండ్ ఆయన వద్ద ఆప్రతిపాదన పెట్టి… ” తిరస్కరించలేని విధంగా ఫిక్స్ ” చేయాలన్న వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున వ్యాపార, ఆర్థిక లింకుల కారణంగా ఈ సారి తప్పించుకోలేకపోవచ్చుననే వాదన కూడా వినిపిస్తోంది.