వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఒక్క సారిగా తిట్ల దండకం వినిపించారు. అనూహ్యంగా విజయసాయిరెడ్డి కూడా అదే లో లెవల్లో స్పందించడంతో రోజంతా వారి తీరు చర్చనీయాంశమయింది. చివరికి బండ్ల గణేష్ వ్యాఖ్యలపై స్పందించడం అంటే తన స్థాయిని తగ్గించుకోవడమేనని.. తానేమీ మాట్లాడనని విజయసాయి చెప్పుకోవాల్సి వచ్చింది. అసలు వీరి మధ్య ఎక్కడ గొడవ వచ్చిందనేది చాలా మందికి అర్థం కాలేదు. కానీ వైసీపీలోని అంతర్గత రాజకీయాలు… విజయసాయిరెడ్డిని దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే ఓ మంత్రి సూచనలతోనే ఈ ట్వీట్ వార్‌కు దిగారన్న ప్రచారం జరుగుతోంది.
బండ్ల గణేష్ తన ట్వీట్లో ప్రస్తుత మంత్రివర్గంలో ఓ మంత్రి అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకున్నారు. సందర్భం లేకపోయినా అలా ఎందుకు చెప్పుకున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఓ మంత్రితో ఆయనకు ఉన్న సంబంధాల గురించి గతంలోనే కథలు కథలుగానే చెప్పుకున్నారు. ఆయన తన ప్రాంతంలో వైసీపీ వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి గుప్పిట పట్టేశారని.. గుర్రుగా ఉన్నారు. ఆయనను అక్కడ నుంచి తప్పించే వ్యూహంలో భాగంగానే విజయసాయిరెడ్డిని వివాదాల్లోకి లాగుతున్నారని అంటున్నారు.
బండ్ల గణేష్ విజయసాయిరెడ్డిని కులం కోణంలోనే విమర్శించారు. ఓ కులాన్ని తిడుతున్నారని తెరపైకి తెచ్చారు. ఇది ప్రజల్లో మరింత మైనస్ అవుతుంది. ఓ వ్యక్తిని తిట్టాల్సి వస్తే ఆయనను తిట్టాలి కానీ కులాన్ని తిట్టడం ఏమిటన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో ఉంది. విజయసాయిరెడ్డిని అలా డ్యామేజ్ చేసే ప్రయత్నాల్లోనే … ఆ మాజీ మంత్రి వ్యూహాత్మకంగా బండ్ల గణేష్‌కు బాధ్యతలిచ్చారు. ఆ ట్రాప్‌లో విజయసాయిరెడ్డి పడటంతో ఆయనకు డ్యామేజ్ జరిగిపోయిందని తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ అంత్గత రాజకీయాలు రసరవత్తరంగా సాగుతున్నాయి.