పంజాబ్లో రైతు చట్టాలను సమర్థిస్తూ.. రైతులకను కించ పరుస్తూ మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యేను రైతులు వెంటపడి కొట్టారు. బట్టలన్నీ చింపేసి కొట్టారు. పోలీసులు ఆయనను కాపాడలేకపోయారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖచ్చితంగా ఇది వైరల్ అవుతున్న సమయంలోనే ఏపీ మంత్రి ఒకరు రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనే రంగనాథరాజు. వరి పండించడం అంటే సోమరిపోతు వ్యవసాయం అని.. ఆ పంట వేసే వాళ్లందరూ సోమరిపోతులేనన్నట్లుగా మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఓ వైపు పంజాబ్లో ఎమ్మెల్యేని చితక్కొట్టిన వార్తలు.. మరో వైపు ఏపీ మంత్రి రైతులను కించ పరిచేలా చేసిన వ్యాఖ్యలను కంపేర్ చేసి.. షేర్ చేయడం ప్రారంభించారు. మరో వైపు రైతు సంఘాలు రోడ్డెక్కాయి. రంగనాథరాజు అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని… ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
విపక్ష పార్టీలు కూడా.. మంత్రి రంగనాథరాజు రైతులపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. వరి సోమరిపోతు వ్యవసాయమని మంత్రి మాట్లాడటం సిగ్గుచేటని…రైతులకు క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదం అంతకకూ పెరిగిపోతూండటంతో తిరుపతిలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన రంగనాథరాజు హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. క్షమాపణలు చెప్పారు. తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. రైతుల్ని క్షమించాలని వేడుకున్నారు. అయితే ఆయనను కేబినెట్ నుంచి తొలగించి.. ముఖ్యమంత్రి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.