బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను వైసీపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అప్పగించింది. ఆయన వైసీపీ స్టైల్లో… దూకుడైన ఆరోపణలు.. విమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. దేవుడి ఆస్తులపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నందున ఆరోపణలు కూడా ఆదే కోణంలో ఉంటున్నాయి. నూజివీడులో దేవుడి భూములు కన్నా కబ్జా చేశాడని ఆరోపణలు గుప్పించిన వెల్లంపల్లి..తాజాగా..చంద్రబాబుకు అమ్ముడుబోయారని ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల కిందట.. కరోనా టెస్టింగ్ కిట్లలో అవినీతి గురించి కన్నా ప్రశ్నించినప్పుడు.. ఇలాంటి ఆరోపణలే విజయసాయిరెడ్డి చేశారు. ఇప్పుడు ఆలయ భూముల గురించి కన్నా ప్రశ్నిస్తూండటంతో.. మరోసారి వెల్లంపల్లిఅవే ఆరోపణలు చేస్తున్నారు.
పాస్టర్లు, ఇమామ్‌లకు హిందూ ఆలయాల సొమ్ము ఇస్తున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం దారుణమని వెల్లంపల్లి చెబుతున్నారు. తాము భూములు అమ్మకం ప్రక్రియను రద్దు చేసినా… బీజేపీ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు..దీనిపై.. కన్నా లక్ష్మినారాయణ వెంటనే కౌంటర్కౌంటర్ ఇచ్చారు. మంత్రి వెల్లంపల్లికి జీవో రద్దు, నిలుపుదల మధ్య తేడా కూడా తెలియదని విమర్శించారు. చాక్లెట్ ఇచ్చి నెక్లస్ ఎత్తుకెళ్లినట్టుగా నవరత్నాల వ్యవహారం ఉందని..ఏడాదిలోనే ప్రభుత్వ ఆస్తులు అమ్మే స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారుని.. టీటీడీ ఆస్తుల అమ్మకం జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర బీజేపీ నేతలతో పోలిస్తే..కన్నా లక్ష్మినారాయణ ప్రభుత్వంపై అగ్రెసివ్‌గా వెళ్తున్నారు.
చాలా మంది నేతలు… ఆలయ భూముల అమ్మకంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిన తర్వాత.. సైలెంటయిపోయారు. కానీ కన్నా మాత్రం… ప్రభుత్వం మోసం చేస్తోందని కొత్త ఆరోపణలతో దీక్ష ప్రారంభించారు. దీంతో వైసీపీ నేతలు.. కన్నాను మరోసారి అమ్ముడుపోయారనే దిశగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. కొసమెరుపేమిటంటే…త్వరలో కన్నాను.. బీజేపీ చీఫ్ పోస్టు నుంచి తప్పించబోతున్నారని..వైసీపీ నేతలే ప్రచారం చేస్తూ….తమకు అనుకూలంగా ఉండే.. బీజేపీ ఏపీ చీఫ్ రాబోతున్నాడని అంటున్నారు.