చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం అక్రమం అని…చంద్రబాబు గౌరవంగా.. ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుందని మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్‌లు… మొదటి హెచ్చరిక జారీ చేశారు. అంతకు ముందు కలెక్టర్ల సమావేశం రెండవ రోజు సీఎం జగన్ మరో అడుగు ముందుకేశారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని తేల్చారు. కరకట్టకు, నదీ ప్రవాహానికి మధ్యలో నదీ ప్రవాహం వైపు చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసం, కరకట్టవైపు ప్రజావేదిక ఉంటుంది. కరకట్ట వైపున్న ప్రజావేదికను కూల్చివేస్తుంటే దానికిలోపలున్న చంద్రబాబు నివాసం కూడా అక్రమేనని జగన్ ప్రకటించారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఇంకా అదే నివాసంలో ఉంటే ప్రజలకు ఎటువంటి సంకేతం ఇచ్చినట్టవుతుందని సీఎం జగన్ అధికారులను ప్రశ్నించారు. చంద్రబాబు నివాసం వైపుకు చెయ్యి చూపిస్తూ ఆయన ఆ నివాసంలో ఉన్నారని, అది అక్రమ కట్టడమే అవుతుందని కూడా జగన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం మారిన తర్వాత మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రజావేదికను తనకివ్వాలని ప్రతిపక్ష నేత హోదాలో తన నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మొదటి కలెక్టర్ల సమావేశం ప్రజావేదికలో నిర్వహించి, ఈ నిర్మాణం అక్రమమని, అనుమతుల్లేవని చెప్పటమే కాకుండా కూల్చివేస్తున్నామని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇటువంటి నిర్మాణాలను అనుమతిస్తే అందరూ దీన్నే ఆదర్శంగా తీసుకుంటారని జగన్ వ్యాఖ్యానించారు. కృష్ణానది కరకట్ట నుంచి నదీ ప్రవాహం మధ్యలో ఉన్న 40 అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించారు. వీటన్నింటికీ గతంలోనే నోటీస్ లు జారీ చేసినప్పటికీ నేటి వరకు మరలా పురోగతి కనిపించలేదు. ఎందుకంటే ఇవన్నీ కోర్టు వివాదాల్లో ఉన్నాయి.
చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని ఎస్టేట్స్ ఓనర్ సీఆర్డీఏ ఇచ్చిన నోటీసులపై కోర్టుకెళ్లారు. అయితే చంద్రబాబు ప్రస్తుతం ఆ నివాసంలో అద్దెకుంటున్నారు. బుధవారం ప్రజావేదికను కూల్చేయాల్సిందేనంటూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఇక చంద్రబాబు నివాసంపై అందరి చూపు పడింది. కోర్టులో కేసు ఉన్నందున.. చంద్రబాబు నివాసాన్ని ఇప్పటికిప్పుడు కూల్చడం సాధ్యం కాదని అంటున్నారు. అయితే.. మంత్రులు మాత్రం.. హెచ్చరికలు ప్రారంభించారు. దీంతో.. రాజకీయం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.