పథకాలన్నింటికీ కేంద్రమే నిధులు ఇస్తోంది.. కానీ మోదీ ఫోటో ఏది అని ఏపీ పర్యటనకు వస్తున్న కేంద్రమంత్రులు నిలదీస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అవి పొగడ్తలు అయినట్లుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడుతున్నారు. ఈ విచిత్ర సన్నివేశాలు ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఏపీ పర్యటనకు కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వచ్చారు. ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఏపీకి వచ్చిన విషయం తెలియదు. కానీ ఆమె కేంద్ర పథకాలు.. మోదీ ఫోటోల గురించి వైసీపీ నేతల్ని.. అధికారుల్ని నిలదీసిన తర్వాత ఒక్క సారిగా హైలెట్ అయింది. మూడు రోజుల పాటు ఆమె ఈ హడావుడి చేయడంతో ఏం చేయాలో తెలియక వైసీపీ నేతలు కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ఆరోగ్య , కుటుంబ మంత్రిత్వ శాఖ కావడంతో కేంద్ర మంత్రి ఎక్కువగా ఆస్పత్రులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర నిధులతో నడుస్తున్న ప్రతి అంశాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఉన్నతాధికారులు మాత్రమే కాదు.. వైసీపీ నేతలు.. మంత్రి విడదల రజనీ కూడా ఉన్నారు. ఆమె వెళ్లిన చోటల్లా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏం చెప్పాలో తెలియని మంత్రి రజనీ.. కేంద్రమంత్రి చెప్పినవి కరెక్ట్ చేసుకుంటామని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆమె విమర్శించినా.. పొగుడుతున్నట్లుగా చిరునవ్వులు చిందించడం తప్ప ఏమీ చేయలేకపోయారు.
మామూలుగా ఎవరైనా వచ్చి విమర్శలు చేస్తే.. వెంటనే కౌంటర్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఏపీ బీజేపీ నేతలు ఎవరైనా విమర్శిస్తే వారిని టీడీపీకి అంటగట్టేసే వైసీపీ నేతలు.. కేంద్రమంత్రి విషయంలో మాత్రం కనీసం నోరెత్తడం లేదు. ఆమె చేస్తున్న విమర్శలు కూడా కరెక్టనన్నట్లుగా అంగీకరిస్తున్నారు. వైసీపీ నేతల తీరుతో రాజకీయవర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇంత వెన్నుముక లేని రాజకీయం చేస్తున్నారేమిటన్న అభిప్రాయం కలగడమే దానికి కారణం.