ఉత్తారంధ్ర కోస్తా మంత్రులకు జనసేన కార్యకర్తల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ నివేదికలు ఇవ్వడంతో అత్యవసరంగా సెక్యూరిటీ పెంచారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ముప్పు ఎందుకంటే.. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ అనే ఆవేశం స్టార్ చేసిన పనికి అందరూ వణికిపోవాల్సి వస్తోంది. మీడియా ముందుకు వచ్చి బూతులు తిట్టి.. కొడతా.. గితడా అని డైలాగులు కొట్టే దువ్వాడ శ్రీనివాస్.. మూడురోజుల కిందట ఎవరూ లేని సమయం చూసి జనసేన ఆఫీసును తన కార్యకర్తలతో ధ్వంసం చేయించారు.. ఈ ఘటన కలకలం రేపింది. టీడీపీ ప్రధాన కార్యాలయంపైనే దాడి చేశారు .. ఇక టెక్కలి జనసేన ఆఫీసు ఓ లెక్కా అని వైసీపీ నేతలు అనుకున్నారు.
కానీ ఇంటలిజెన్స్ పోలీసులు మాత్రం ఎక్కడ ఏ ఫోన్లో విన్నారో.. ఎ వాట్సాప్ లో చూశారో కానీ మంత్రులపై జనసైనికులు ఆకస్మిక దాడికి ప్లాన్ చేసుకున్నారని డౌట్ పడ్డారు. వినతి పత్రాలిచ్చేరూపంలో వస్తారని.. ఏదో రూపంలో దాడి చేస్తారని.. కాన్వాయ్‌గా వెళ్తున్నప్పుడు అడ్డు పడతారని.. ఇలా రకరకాల అనుమానాలతో సెక్యూరిటీని పెంచాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా మంత్రులకు అంటే దాదాపుగా పదమూడు మంది మంత్రులకు కొత్తగా సెక్యూరిటీ పెంచారు.
అసలు దువ్వాడ జనసేన ఆఫీసుపై దాడి చేయడం ఎందుకు ఎలా పోలీసుల భద్రత పెంచుకోవడం ఎందుకని.. వైసీపీలో మర్యాద రామన్నలు మథనపడుతున్నారు. ఇప్పుడంటే పోలీసులు ఉంటారు…. ప్రతీ సారి ఉండరు కదా అనేది వారి బాధ. పోలీసులు లేని సందర్భంలో .. ఒక వేళ పోలీసులు ఉన్నా… సరే అభిమానులంతా గుంపుగా ఉన్న చోట దొరికితే ఎలా ఉంటుందో అని.. విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలను గుర్తుచేసుకుని మథనపడుతున్నారు. ఎవరి నొప్పి వారికే తెలుస్తుంది మరి !