అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్న మురళీమోహన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ తిరుపతి వెంకన్నచౌదరి అంటూ మాట్లాడడం వివాదాలకు దారి తీసింది. ఇప్పుడు అదే కోవలో వైకాపా నేత స్వామి వివేకానందుని ఉద్దేశించి మాట్లాడుతూ స్వామి వివేకానంద రెడ్డి అని అసెంబ్లీలోనే వ్యాఖ్యానించడం చర్చకు దారితీస్తోంది. వివరాల్లోకి వెళితే
వైఎస్ఆర్ సీపీ దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అసెంబ్లీలో మన విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతూ స్వామి వివేకానంద కొటేషన్ ఒకదానిని ప్రస్తావించారు. “If the poor cannot come to education, education must reach them, at the plough, in the factory and everywhere” అని సాక్షాత్తు స్వామి వివేకానంద రెడ్డి గారు అన్నారు అంటూ ఎమ్మెల్యే గారు వ్యాఖ్యానించడం అసెంబ్లీ సమావేశాలను చూస్తున్న జనాలని ఆశ్చర్యపరిచింది. గతంలో లో మురళీమోహన్ కూడా తాను ఎంపీగా ఉన్నప్పుడు వెంకన్న చౌదరి అని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాలకు దారి తీస్తే, మురళీ మోహన్ మీడియా ముందుకు వచ్చి తాను అన్నది పొరపాటు అంటూ లెంపలు వేసుకున్నారు. బిజెపి నేత రామ్ మాధవ్ కూడా ఒక సభలో ప్రసంగిస్తూ, మురళీమోహన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, టిడిపి నేతలకి కుల పిచ్చి ఉంది అన్నట్టుగా అన్యాపదేశంగా సందేశమిచ్చారు.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే స్వామి వివేకానందుని పట్టుకుని స్వామి వివేకానంద రెడ్డి అనడం చూస్తుంటే, బహుశా తన పార్టీలో ఉన్న ఇతర నేతలు అందరిని రెడ్డి రెడ్డి అని పిలిచి పిలిచి ఈయన అలవాటు పడిపోయి స్వామి వివేకానంద కి కూడా రెడ్డి ట్యాగ్‌లైన్ అంటించాడేమో అని చూసిన జనాలు అనుకుంటున్నారు.