హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హోదాలో తనకు సంక్రమించిన పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీకి ఛైర్మన్ పదవికి భూమా నాగిరెడ్డి రాజీనామా చేశారు. దీనితో ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి ప్రవేశించటం ఖరారయినట్లయింది. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరికపై చెప్పాల్సిన సమయంలో అంతా చెబుతానని అన్నారు. రోజులా, గంటలా అనేది వేచి చూడాలని చెప్పారు. ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడతానని అన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలని కోరారు. మీకు చెప్పకుండా ఏమీ చేయనని అన్నారు. ఆయన ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారని చెబుతున్నారు. భూమాతో పాటు వైసీపీకు చెందిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, విజయనగరం జిల్లా ఎమ్మెల్యే సుజయ రంగారావు కూడా ఇవాళే టీడీపీలో చేరే అవకాశముందంటున్నారు. దీనితో ఇవాళ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరే ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరేటట్లు కనబడుతోంది. మరోవైపు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు శిల్పా సోదరులను ముఖ్యమంత్రి విజయవాడ పిలిచారు. భూమా చేరికపై వారితో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలిసింది.