ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దుందుడుకు చర్యలతో తనని వేధిస్తున్నారంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు! లింగమనేని వెనక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపించారు. ఆయన రాయమంటనే… ఈయన లేఖ రాశారని తేల్చి చెప్పేశారు!! ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్జీటీ తీర్పులు వచ్చినా, రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ రూల్స్ ఉన్నా , లోకాయుక్త తీర్పులున్నా, హైకోర్టు ద్వారా తాను ప్రయత్నించి రెండుసార్లు నోటీసులు ఇచ్చినా… లింగమనేని దేనికీ స్పందించలేదనీ, ఒక్క ఉత్తరంగానీ ఒక్క వాక్యం గానీ ఆయన రాసింది లేదన్నారు.
అలాంటి వ్యక్తి ఇవాళ్ల ఖాళీగా కూర్చుని, తనపై అన్యాయాలూ అక్రమాలూ జరుగుతున్నాయనీ ఇబ్బందులుకు గురిచేస్తున్నారంటూ ఐదు పేజీల లేఖ రాశారంటే ఆలోచించాలన్నారు ఆర్కే. ఎంత దారుణంగా ఆయనపై చంద్రబాబు నాయుడు ఒత్తిడైనా తీసుకొచ్చి ఉండాలీ, లేదంటే… చంద్రబాబు నాయుడు ఓటమిని భరించలేక ఆయనే స్వయంగా స్పందించి ఉండాలన్నారు ఆర్కే. చట్టానికి లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుంటే, దీన్ని సమాజానికి రుద్దుతున్నారన్నారు. బుద్ధి లేని ఒక ముసలాయన్ని లింగమనేని అండగా తెచ్చుకున్నారంటూ… ఈనాడు పత్రికను చూపించారు ఆర్కే. ఆయన వయసుకైనా గౌరవం ఇద్దామనుకున్నా, అదీ లేకుండా చేసుకుంటున్నారనీ, అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుంటే.. దాన్ని కూల్చివేత గుండె కోత అంటూ రాస్తున్నారీ పత్రికాయన అంటూ విమర్శించారు. చంద్రబాబుగానీ, లింగమనేనిగానీ స్వయంగా వస్తే మీరూ మేమూ కలిసి అధికారులతో కూర్చుని ఈ నిర్మాణాలపై చర్చించడానికి సిద్ధమా అంటూ సవాలు చేశారు ఆర్కే. ఏ ముఖ్యమంత్రి అడిగినా గెస్ట్ హౌస్ ఇచ్చేవాడినంటున్న లింగమనేని, చంద్రబాబు నుంచి ఎలాంటి ప్రయోజనాలూ పొందలేదా అంటూ ప్రశ్నించారు.
లింగమనేని లేఖ రాయడం వెనక కూడా చంద్రబాబు నాయుడే ఉన్నారని ఆర్కే ఆరోపిస్తున్నారు! గత టీడీపీ హయాంలో చంద్రబాబు దాన్లో అద్దెకి ఉన్నారు, అంతే కదా! ఆర్కే స్పందన చూస్తుంటే… రాష్ట్రప్రభుత్వం చంద్రబాబు సెంట్రిక్ గానే ఆలోచిస్తోందనీ, చంద్రబాబు గతంలో ఉన్నారు కాబట్టే అనే అంశాన్నే ప్రధానంగా చూస్తోందన్న ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది.