హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో రైలుకు నిప్పంటించిన కేసులో ఇటీవల అరెస్ట్ అయ్యి నెల్లూరు జైలులో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మరో కేసులో అరెస్ట్ చేశారు. 2009లో జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ గోడలపై రాయించిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. ఇది చిత్తూరు జిల్లాకు చెందిన కేసు కావటంతో చిత్తూరు పోలీసులు చెవిరెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలునుంచి చిత్తూరు జిల్లా పీలేరు కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
మరోవైపు చెవిరెడ్డిని పీలేరుకు తరలించకముందు జగన్ నెల్లూరు జైలుకు వెళ్ళి అక్కడ ఖైదీలుగా ఉన్న తమ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని, చెవిరెడ్డిని పరామర్శించారు. జగన్ వెంట జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాకాని గోవర్దనరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. నారా లోకేష్ అవినీతిని అడ్డుకున్నందుకే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. మిథున్ రెడ్డి తప్పు ఉంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.