ఎల్జి పాలిమర్స్ దుర్ఘటన అనేక కుటుంబాలను చిదిమేసింది. చిన్న పిల్లలు సహా 12 మందికి పైగా చనిపోయారు. అనేకమందికి తీవ్ర అస్వస్థత కలగడం, కేజిహెచ్ ఆస్పత్రిలో చికిత్స చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ఈ సంఘటనపై స్పందించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. అదే విధంగా చికిత్స పొందుతున్న వాళ్లకు కూడా అస్వస్థత స్థాయిని బట్టి పరిహారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో వై ఎస్ ఆర్ సి పి చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ హేయమైన వ్యాఖ్యలు చేశారు. తాము చనిపోయి ఉంటే బాగుండేదని , కోటి రూపాయలు వచ్చాయని కొందరు అనుకుంటున్నారు అంటూ ఆయన సాక్షి ఛానల్ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రజలను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
పరిహారం ప్రకటించినప్పటికీ, ఎల్జి పాలిమర్స్ కంపెనీపై సరైన చర్యలు తీసుకోలేదు అంటూ గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక సమాచారం మేరకు ఇప్పటికీ ప్రజల్లో స్టైరీన్ గ్యాస్ పట్ల భయాందోళనలు ఉన్నాయి. దీర్ఘకాలిక దృష్టితో కంపెనీ ని తరలించే ప్రయత్నం చేయకుండా కంపెనీ మీద సరైన చర్యలు తీసుకోకుండా పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం పై కొంతమంది గ్రామస్తుల లో నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పులిమీద పుట్రలా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రజలను అసహనానికి గురి చేసే వ్యాఖ్యలు చేశారు. సాక్షి ఛానల్ లో కొమ్మినేని నిర్వహించే డిబేట్ లో వైయస్సార్సీపి చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ, ” ఈ మాట నేను చెప్పకూడదు కానీ , చాలామంది ఈ రోజు అయ్యో మా ప్రాణాలు పోయినా బాగుండేది , మాకు కోటి రూపాయలు వచ్చి ఉండేవి అని అనుకుంటున్నారు” అని వ్యాఖ్యలు చేశారు. అయితే డిబేట్ నిర్వహిస్తున్న కొమ్మినేని వెంటనే ఎమ్మెల్యే ని సరి చేసే ప్రయత్నం చేశారు.
ఏది ఏమైనా సాక్షి ఛానల్ లో దుర్ఘటన జరిగిన రోజున కొమ్మినేని మాట్లాడుతూ ఈ గ్యాస్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు అని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసి పోవడం, ఇప్పుడు మరొక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మా ప్రాణాలు పోయినా బాగుండేది అని ప్రజలు అనుకుంటున్నారు అని వ్యాఖ్యలు చేయడం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కి, వైఎస్సార్సీపీ నాయకుల కి ప్రజల మీద ఉన్నటువంటి అభిప్రాయం వెల్లడి చేస్తోంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
It seems victims are happy.. pic.twitter.com/evuOgO5gxm
— santosh ram (@rokkam_sr) May 12, 2020