కొన్ని నెలల కిందట విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా జరిగిన సభ వివరాలు ఎవరికైనా గుర్తున్నాయా? ఆ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడిన మాటలు సభికులను విస్మయపరచాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ.. ఆ సభలో ఆయన చంద్రబాబును బహిరంగంగా కీర్తించిన తీరు, సాంప్రదాయ తెలుగుదేశం పార్టీలోని వ్యక్తిపూజ భజన తీరుతెన్నులను మించిపోయిందని అప్పట్లోనే అందరూ నివ్వెరపోయారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ అంత దారుణంగా జలీల్‌ఖాన్ , చంద్రబాబును ఆకాశానికెత్తేస్తూ కీర్తిస్తూ ఉంటే జగన్ ఊరుకుంటాడా? అని కూడా అందరూ అనుకున్నారు. ఆ సమయంలోనే ఆయన తెదేపాలోకి ఫిరాయిస్తారనే అనుమానలు అందరికీ కలిగాయి.
ఆ తర్వాత కాల్‌మనీ వ్యవహారంలో వైకాపా అసెంబ్లీలో పోరాడినప్పుడు కూడా.. జలీల్‌ఖాన్ చాలా మెతగ్గానే వ్యవహరించారు. ఇంకా సభలో అరుస్తున్న తమ పార్టీ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లునగా ఆయన టీవీ కెమెరాల్లో కనిపించారు. ఇలా తెదేపాకు జలీల్‌ఖాన్ ఫిరాయించే ఉద్దేశంతో ఉన్నట్లుగా చాలా కాలంగా సంకేతాలు ఉన్నాయి.
తాజాగా గురువారం నాడు మంత్రి దేవినేని ఉమాతో కలిసి జలీల్‌ఖాన్ చంద్రబాబు ఇంటికి వెళ్లి కలవడంతోనే ఆయన ఫిరాయించబోతున్నట్లు ముమ్మరంగా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని గంటల తరువాత జలీల్‌ఖాన్ ప్రెస్‌మీట్ పెట్టి తాను పారీట్ర మారడం లేదని స్పష్టం చేశారు. ”ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం వైఎస్సార్ సీపీలోనే ఉంటా. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తా. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించేందుకు వెళితే పార్టీ మారుతున్నట్లేనా?” అంటూ జలీల్‌ఖాన్ ప్రశ్నించడం విశేషం. అయితే ఇంతలో ఏం జరిగింది.. ఫిరాయింపు ఎందుకు ఆగింది అనే సందేహాలు చాలా మందికి కలిగాయి.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. దేవినేనితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లి.. తనకు మైనారిటీ మంత్రిగా అవకాశం ఇచ్చేట్లయితే పార్టీ మారుతా అంటూ జలీల్‌ఖాన్, చంద్రబాబుకు బేరం పెట్టినట్లు తెలుస్తున్నది. తెదేపాకు ఏపీలో ప్రస్తుతం మైనారిటీ ఎమ్మెల్యే లేరు. మైనారిటీ శాఖను పల్లెరఘునాధరెడ్డి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మైనారిటీ ఎమ్మెల్యేగా పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తారా అని జలీల్ అడిగారని, అందుకు చంద్రబాబు తిరస్కరించారని చెబుతున్నారు. మంత్రి పదవి ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చంద్రబాబు తెగేసి చెప్పడంతో.. జలీల్‌ఖాన్ ఫిరాయించబోనంటూ బయటకు వచ్చిన తర్వాత మాట మార్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాయిలాలు ఇస్తే వెళ్తారు. ఇవ్వకపోతే.. ఆగిపోతారు.. అదీ సంగతి!!