అయ్యన్నపాత్రుడు జగన్ను తిట్టారని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటి ముట్టడికి రావడం కలకలం రేపింది. ఉదయమే పెద్దగా సెక్యూరిటీ లేని సమయంలో నేరుగా చంద్రబాబు ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నారు. వారిని పోలీసులు కూడా అడ్డుకోలేదు. వీరు ఇలా ముట్టడించారని తెలిసి వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో జోగిరమేష్ వాగ్వాదం పెట్టున్నారు. కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. చంద్రబాబు ఇంటిపై రాళ్లు రువ్వారు.
వైసీపీ కార్యకర్తలు రాళ్లు వేస్తున్నా.. కర్రలతో దాడి చేస్తున్నా పోలీసులు అడ్డుకోలేదు. జోగి రమేష్ స్వయంగా పార్టీ కార్యకర్తలను తీసుకుని చంద్రబాబు ఇంటికి వచ్చారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చామని టీడీపీ నేతలు తమపై దాడి చేశారని జోగి రమేష్ ఆరోపించారు . తన కారును టీడీపీ నేతలు పగుల గొట్టారని ఆరోపించారు. చంద్రబాబు తనపై గూండాలతో దాడి చేయించారని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబుపై తిట్ల దండకం వినిపించారు. ఇంట్లో పడుకోవడం కాదు దమ్ముంటే బయటకు వస్తే తేల్చుకుందామని సవాల్ చేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు సంగతి చూస్తామన్నారు.
ముందుగా ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్దకు వైసీపీ కార్యకర్తలు రాకుండా నిలువరించడంలో విఫలమైన పోలీసులు ఆ తర్వాత కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోయారు. ఘర్షణలు ప్రారంభమైన తర్వాత తప్పనిసరి అన్నట్లుగా వైసీపీ కార్యకర్తలను అక్కడ్నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఇంటికి అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున అనుచరులతో కర్రలతో వెళ్తూంటే పోలీసులు కనీసం అడ్డుకోకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రతిపక్ష నేతకు భద్రత లేదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్థాన్లా మార్చారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారన్నారు.