ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా.. ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించే ఆలోచనలో ఉన్నారు. బహుశా..చంద్రబాబు దీక్ష చేపట్టే రోజే… ప్రజల దృష్టి ఆకర్షించడానికి రాజీనామాలు ప్రకటించే అవకాశం ఉంది. అలా అయితేనే ప్రత్యేకహోదా కోసం తాము ప్రజల దృష్టిలో చాంపియన్లుగా ఉంటామని అంచనా వేసుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా సేకరించారని అంటున్నారు. జగన్ నిర్ణయం తీసుకుంటే… వ్యతిరేకించే పరిస్థితి ఎమ్మెల్యేలకు లేదు. కాబట్టి.. ఇప్పుడు రాజీనామాలపై జగన్ దే తుది నిర్ణయం కానుంది.
ఒక వేళ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే… అది జగన్ ఇప్పటి వరకు చేసుకున్న సెల్ఫ్ గోల్స్ అన్నింటికి బాబు లాంటిదవుతుంది. దానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఎమ్మెల్యేలు రాజీనామాలు ప్రత్యేకహోదా కోసమేనా అని ప్రజల్లో కచ్చితంగా సందేహాలు వస్తాయి. ఎందుకంటే… కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా కోసం.. ఇక్కడ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఎందుకన్న ప్రశ్న సహజంగానే.. సామాన్యుల్లో ఉదయిస్తుంది. ఇప్పటికే.. హోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని మోదీని ఏమీ అనకుండా… కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ వస్తూండటంతో ప్రజల్లో అనుమానబీజాలు పడ్డాయి.
వైసీపీ ఎంపీలు.. ఇప్పటికే రాజీనామాలు చేశారు. ఆమోదం పొందని రీతిలో రాజీనామాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అదే తరహాలో ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేద్దమనుకుంటున్నారు. కానీ ఇక్కడ స్పీకర్ ఫార్మాట్లో ఇస్తే మాత్రం.. ఆమోదం పొందడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఆమోదించకుండా పెండింగ్ లో పెడితే.. భయపడిందని ప్రభుత్వంపై విమర్శలొస్తాయి.
ఇక ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే… వైసీపీకి ముంచుకొచ్చే అతి పెద్ద ప్రమాదం… పార్టీ ఉనికికే సమస్య వచ్చి పడే అవకాశం ఉండటం. దాని కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు అందడంతోనే స్పీకర్ ఆమోదించేస్తారు. టీడీపీ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తారు. అంటే అప్పుడు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఉండరు. కానీ అధికారికంగా రికార్డుల్లో మాత్రం 21 మంది ఉంటారు. వీరు టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు. వీరంతా… కలసికట్టుగా…వైసీపీ శాసనసభపక్షంగా మారిపోయి… వైసీపీని టీడీపీలో విలీనం చేస్తున్నట్లుగా స్పీకర్ కు లేఖ ఇస్తారు. దాంతో పార్టీ విలీనం.. అటు పార్టీల మారిన ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్లు రెండింటింకి ఒకేసారి పరిష్కారం లభిస్తుంది. ఇదంతా టీడీపీ ప్లాన్. ఎమ్మెల్యేలు విలీనమైనంత మాత్రాన పార్టీ విలీనం కాదు కానీ.. శాసనసభాపక్షం విలీనం అయిందని ఈసీ దగ్గరకు వెళ్లొచ్చు. టీడీపీ కావాల్సినంత రచ్చ చేయవచ్చు. వైసీపీ అనే పార్టీ లేదని హంగామా చేయవచ్చు. దీని వల్ల వైసీపీ శ్రేణుల స్థైర్యమే దెబ్బతినే అవకాశం ఉంది.
మొత్తానికి రాజీనామాల వ్యూహాన్ని అమలు చేయాలంటే… టీడీపీ ఎత్తులకు వైసీపీ పైఎత్తులు వేయాల్సిందే. లేకపోతే.. ఇప్పటి వరకు చేరుకున్న సెల్ఫ్ గోల్స్ అన్నింటిలోనూ..ఇదే అతి పెద్దవుతుంది. పార్టీ మీద చావు దెబ్బ పడుతుంది.