గడప గడపకూ వెళ్లడం లేదని.. టిక్కెట్ ఇవ్వనని అధ్యక్షుడు జగన్ హెచ్చరికలు చేస్తున్నా ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లడం లేదు. ప్రజాగ్రహం వల్ల ప్రచారం జరుగుతోంది కానీ.. అసలు విషయం మాత్రం ఎమ్మెల్యేలు జగన్ కు చెప్పుకున్నారట. అదేమిటంటే ఖర్చులు. గడప గడపకూ వెళ్లాలంటే రోజుకు లక్ష ఖర్చవుతున్నాయని.. అంత స్తోమత లేదని వారు చెబుతున్నారట. తమకు లక్ష ఎలా ఖర్చవుతున్నాయో కూడా జగన్ కు లెక్కలు చెప్పారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
గడప గడపకూ వెళ్తే.. తమతో పాటు నేతలు, కార్యకర్తలకు అవసరం అయిన ఖర్చలు పెట్టుకోవాలి. గడప గడపకు వెళ్లిన సమయంలో అక్కడ మహిళలు హరతి పడితే పళ్లెంలో కనీసం 500 ఆపైన పెడితేనే సరే.. లేకపోతే అక్కడే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు హరతులు పట్టం వలన ఖర్చు పెరుగిపోతోంది. ఆ కాలనీలో కాస్త పేరు వ్యక్తి ఇంట్లో వాళ్లు హారతి పడితే కాస్త ఎక్కువే చదివించుకోవాలి.
ఇక వీటితో పాటుగా ఇంటి ముందుకు వెళ్ళి గడపలో ఉన్న కుటుంబ సభ్యుల బాగోగులు ప్రశ్నించినప్పడు, ఆరోగ్యం బాగోలేదనో, పిల్లలకు పుసతాకాలు లేవనో,చేతి పని చేసుకునేందుకు కుట్టు మిషన్ కావాలనో,ఇస్త్రి బండి, కూరగాయల బండి వంటివి అడిగినప్పుడు వాటిని వెంటనే అందించాల్సి వస్తుందని .. ఇలా కూడ ఖర్చు పెరిగిపోతుందని నేతలు చెబుతున్నారు.ఇలా ప్రతి దానికి ఎంతో కొంత సమర్పించుకోవల్సి రావటం వలన గడప..గడప కాస్ట్ లీ గా ఉందని నేతలు తమ ఆవేదననే వెలిబుచ్చుతున్నారు.
ఆర్థికంగా తాము బలంగా లేమని.. సంపాదించుకోలేకపోతున్నామని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు జగన్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంతా చేసి చివరికి సర్వే ఫలితాలు లేవని చేతులు ఎత్తేస్తే ఎం చేయాలని కొందరు నేతలు బహిరంగంగానే తమ వేదనను బయటపెడుతున్నారు.