ఈనెల 20న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక రోజు నిరాహార దీక్ష చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు, పార్టీ ఎమ్మెల్యేలూ నాయకులు కూడా రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21 నుంచి అన్ని నియోజక వర్గాల్లో సైకిల్ యాత్రలు కూడా నిర్వహించబోతున్నారు. ప్రత్యేక హోదా సాధనతోపాటు, నాలుగేళ్లలో టీడీపీ సర్కారు చేసిన పనులపై పెద్ద ఎత్తున ప్రచారానికి సిద్ధమౌతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీ వైకాపాలో కొంత కలవరం ప్రారంభమైనట్టు సమాచారం. చంద్రబాబు దీక్షను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై పార్టీ నేతలతో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా తెర మీదికి వచ్చిన ప్రతిపాదన ఏంటంటే… వైకాపా ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా! ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీలు రాజీనామా చేసి… తమ వెంట నడవాలనే సవాల్ ను టీడీపీ ముందుంచామని కొంతమంది నేతలు అభిప్రాయపడ్డారట! ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరించి.. చంద్రబాబు దీక్ష చేసే రోజునగానీ, లేదా సైకిల్ యాత్ర ప్రారంభం కాబోతున్న రోజునగానీ ఎమ్మెల్యేలతో రాజీనామా అంశం తెర మీదికి తీసుకొస్తే… మరోసారి ప్రజలంతా వైకాపా వైపు చూస్తారనీ, టీడీపీ కార్యక్రమాలకు ఇలా ప్రాధాన్యత తగ్గించొచ్చు అనే వ్యూహంలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలకు మా ఎమ్మెల్యేలు సిద్ధం, మీ ఎమ్మెల్యేలు సిద్ధమా అనే సవాల్ ను జగన్ తెరమీదికి తెచ్చే అవకాశం ఉందని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైకాపా ఎంపీలు పార్లమెంటులో హోదా కోసం కొద్దోగొప్పో పోరాటం చేశారు. ఢిల్లీ వేదికగా హడావుడి చేసి, రాజీనామాలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి ఎమ్మెల్యేలు చేసిందేముంది..? కనీసం అసెంబ్లీకి హాజరు కావాలన్న నైతిక బాధ్యతను కూడా గాలికి వదిలేశారు. జగన్ పాదయాత్ర చుట్టూ చక్కర్లూ కొడుతూ అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారు. అన్నిటికీ మించి… ప్రత్యేక హోదా కోసం పోరాటం అని చెబుతున్నారేగానీ, ఈ క్రమంలో ముఖ్యమంత్రిని విమర్శించడానికే పరిమితమౌతున్నారు. పోరాడాల్సింది కేంద్రంతో కదా! భాజపాని ఒక్కటంటే ఒక్కసారైనా విమర్శించారా..? హోదా ఇవ్వాల్సిందీ, హామీలు నెరవేర్చాల్సిందీ ఎవరు.. భాజపా సర్కారు కాదా..?
ఇదే తరహాలో ఆలోచిస్తూ పోతే.. 2014 అనుభవమే వైకాపాకి పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా అంతే, ఓపక్క రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్రులంతా అన్యాయమైపోయామన్న భావనలో ఉంటే… చంద్రబాబును విమర్శిస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఫలితం ఏమైంది..? ఇప్పుడు కూడా అంతే, కేంద్రం తీరుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రజలందరూ ఆవేదనలో ఉంటే… మళ్లీ చంద్రబాబును లక్ష్యంగా చేసుకునే జగన్ రాజకీయాలు చేస్తున్నారు..!