ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఏపీ ప్రతిపక్ష నేతలు గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకునే వరకూ అసెంబ్లీ గడప తొక్కేదే లేదంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సమావేశాలను బహిష్కరించడానికి ఇదే కారణమంటూ పాదయాత్రలో ప్రజలకు చెబుతున్నారు. కానీ, వాస్తవమేంటో అందరికీ తెలిసిందే. జగన్ పాదయాత్ర చేస్తుంటే.. వైకాపా నేతలు అసెంబ్లీలో కూర్చుంటే ఏర్పాట్లు ఎవరు చూసుకుంటారు..? సరే, కారణం ఏదైతేనేం.. ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు చప్పగా ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే, ఆ లోటు తెలియకుండా సభను నిర్వహిస్తోంది అధికార పార్టీ టీడీపీ. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు చేపట్టాలన్న పట్టుదలతో టీడీపీ ఉంది. ప్రతిపక్ష సభ్యులు లేకపోయినా సభను బాగానే రక్తికట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వైకాపా నేతల్లో ఓ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది!
నిజానికి, ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కొందరు వైకాపా ఎమ్మెల్యేలకు మొదట్నుంచీ ఇష్టం లేదు! పాదయాత్రకు ముందు, జగన్ తో జరిగిన పార్టీ నేతల సమావేశంలో సభ బహిష్కరణ అనే ప్రతిపాదనే లేదట. జగన్ లేకుండా అసెంబ్లీలో పార్టీ నేతలను ఎవరు లీడ్ చేస్తారనే చర్చ కూడా ఆయన సమక్షంలోనే జరిగింది. ఈ దశలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కల్పించుకుని.. ‘మీరు పాదయాత్రకు వెళ్తున్నారు కాబట్టి, అసెంబ్లీలో పార్టీ నడిపించేవారు ఎవరో కూడా మీరే నిర్ణయిస్తే బాగుంటుంద’ని అన్నారు. ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించాలని జగన్ అనుకున్నారట. అయితే, ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలీదుగానీ… జగన్ మనసు మారిందని అంటున్నారు. ‘నేను లేనప్పుడు అసెంబ్లీకి మీరు ఎందుకు వెళ్లడ’మనీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారట. సరిగ్గా ఈ సమయంలోనే… ‘ఈ సమావేశాలను బహిష్కరిస్తే ఎలా ఉంటుందీ, ఏయే కారణాలు చూపించి గైర్హాజరు కావొచ్చు అనే అంశాలు ఆలోచించాల’ని సీనియర్ నేతలకు జగన్ సూచించారట. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు షాక్ అయ్యారట!
అయితే, ఇప్పుడు అసెంబ్లీ సజావుగా సాగుతోంది. ఒకపక్క పాదయాత్ర ఎంత తీవ్రంగా ఉన్నా… అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో అధికార పార్టీ ప్రజల్ని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశాల బహిష్కరణను మొదట్నుంచీ వ్యతిరేకించిన కొద్దిమంది సీనియర్లు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట! పాదయాత్రలో ఎంత మాట్లాడినా చంద్రబాబుపై విమర్శలు చేయగలడమే తప్ప, అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని చేజార్చుకున్నామని ఆఫ్ ద రికార్డ్ అంటున్నారట. సభ సజావుగా సాగుతూ ఉండటంతో సమావేశాలను మరికొన్ని రోజులు పెంచేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందనీ, ఇది వైకాపాకి ఇబ్బందికరమై అంశమే అనే అభిప్రాయం ఆ వర్గాల్లో వక్తమౌతోంది. పైగా, సమావేశాలు బహిష్కరించినా కూడా బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లడం పార్టీలో చర్చనీయం అవుతోంది. జగన్ వద్దని చెప్పినా కూడా ఎస్టిమేట్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సో.. జగన్ ఆదేశాలు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొద్దిమందికి రుచించలేదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇది జగన్ తొందరపాటు నిర్ణయంగానే కొందరు వైకాపా నేతలు చూస్తున్నారు.