రాములోరి వివాహం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. వేద పండితులు శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ, సంప్రదాయబద్దంగా రాములోరిని ఆవాహనం చేసుకొని రాముడి చేతిలోని మంగళ్యాన్ని సీతమ్మ మెడలో వేసి , పాదాలకు నమస్కరిస్తారు. ఇదీ ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్బంగా జరిగే తంతు. కానీ, ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం హిందూ సంప్రదాయం, ఆచారాలకు భిన్నంగా సీతమ్మ మెడలో తాళి కట్టేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూల్ జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష స్వగ్రామం చిప్పగిరి. అక్కడి ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు కన్నులపండగా జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా…ఎమ్మెల్యే ముఖ్య తిథిగా హాజరయ్యారు. శ్రీరాముడి తరఫున వేదపండితులు సీతమ్మ మెడలో వేయాల్సిన తాళిబొట్టును ఎమ్మెల్యేనే వేశారు.
వేదపండితులు శ్రీరాముని ఆవాహన చేసుకొని సీతమ్మ మెడలో తాళి కట్టడాన్ని స్వయంగా శ్రీరాముడే.. సీతమ్మ మెడలో తాళి కట్టారనేది భక్తుల నమ్మకం. విరూపాక్షి మాత్రం సంప్రదాయాలు, ఆచారాలు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీరామనవమి సందర్బంగా సీతమ్మ మెడలో మూడుముళ్ళు వేశారు.
వేదపండితులకు బదులుగా ఎమ్మెల్యే తాళి కట్టడం మహా అపచారమని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విరూపాక్షి తాళి కట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేపై నిరసనలు, ఆగ్రహజ్వాలలు కొనసాగుతున్నాయి.
అయితే, వేదపండితుల సూచన మేరకే సీతమ్మ మెడలో తాళి వేశానని, పూజారి చెప్పడంతో కాదనలేకపోయానని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. జరిగిన ఘటనపై హిందూ సమాజం తనను క్షమించాలని కోరారు. ఎమ్మెల్యే క్షమాపణలపై హిందూ సంఘాలు ఏమాత్రం శాంతించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యే ఇది కావాలనే చేశారని, ఆమాత్రం అవగాహన ఉండదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
విరూపాక్షి వ్యవహారంతో వైసీపీ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతి సందర్భంలో వైసీపీ హిందూ వ్యతిరేకి స్వభావాన్ని బయటపెట్టుకుందని , అధికారంలో ఉన్నప్పుడు అంతర్వేది ఘటన, హిందూ ఆలయాలపై దాడులు , తిరుపతి లడ్డూ వ్యవహారంతోపాటు తాజాగా సీతమ్మ మెడలో ఎమ్మెల్యే మూడుముళ్ళు వేయడం పట్ల…. హిందూ మత ఆచారాలపై వైసీపీ విషం కక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా… ఈ విషయం ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి..