అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు.. ఎమ్మెల్యే శిక్షణా తరగతులను.. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిధిగా వచ్చి… ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. ఆ సమయంలో.. ఆయన ఉదాత్తమైన వ్యక్తిగా అందరికీ కనిపించారు. రూల్ బుక్లో ఎన్ని ఉంటాయో.. అన్నీ చెప్పారు. చివరికి ఆ రూల్ బుక్ ప్రస్తావన కూడా తెచ్చారు. ప్రజలు అందర్నీ చూస్తూ ఉంటారని… వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని హితవు పలికారు. ఆ సమయంలో.. రోజా నవ్వుతూంటే.. “ఏంటీ రోజా నవ్వుతున్నావు..” అని కాస్త సీరియస్ అయ్యారు కూడా. అలాంటి సందేశాన్ని శిక్షణ తరగతుల్లో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి.. సభలో తొలి రోజే… తానే వాటిని పట్టించుకోలేదు. చెప్పేటందుకే.. రూల్స్ ఉన్నాయన్నట్లుగా ఆయన ప్రసంగం సాగిపోయింది.
సభలో బూతులకు బీప్ సౌండ్ వాడాల్సిందేనా..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాల్లో వ్యక్తిగత దూషణలు ప్రజల దృష్టిని దాటి పోలేదు. ప్రతిపక్షాన్ని అవమానించేలా.. కించ పరిచేలా.. అవహేళన చేసేలా ముఖ్యమంత్రి మాట తీరు ఉంది. కరువుపై జరిగిన చర్చలో.. వ్యక్తిగత విమర్శలు… చాలా అసువుగా వచ్చేశాయి. సాక్షాత్తూ ముఖమంత్రి జగన్మోహన్ రెడ్డి .. గాడిదలనే పదాన్ని నిర్మోహమాటంగా వాడేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్… మరో అడుగు ముందుకేశారు. జనబాహుళ్యంలో అత్యంత అసభ్యంగా భావించే దొబ్బెయ్ లాంటి పదాల్ని అసెంబ్లీలో తనకు అలవాటైన భాషన్నట్లుగా మాట్లాడేశారు. అధికారపక్ష సభ్యుల తీరు.. తెలుగుదేశం పార్టీని ఆశ్చర్యపరిచింది. రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజమే కానీ… ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం.. అసెంబ్లీలో చాలా అరుదు. ఒక వేళ అలా చేసి ఉంటే.. వెంటనే భేషజాలకు పోకుండా క్షమాపణలు అడుగుతారు. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగిస్తారు. అసెంబ్లీలో ఇదో సంప్రదాయంగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. సుదీర్ఘ కాలంగా అసెంబ్లీలో ఉన్న చంద్రబాబు.. అధికారపక్షం తీరు, మాటలతో విస్తుపోవాల్సి వచ్చింది. అందుకే.. సభ ముగిసిన ప్రెస్మీట్ పెట్టి.. అధికారపక్షం తీరుపై మండిపడ్డారు.
అధికార పార్టీగా మారినా.. బ్రాండ్ ఇమేజ్ మార్చుకోరా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఈ వ్యక్తిగత విమర్శల ఆరోపణలు.. రావడం ఇదే మొదటి సారి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. వారి సభ్యుల వ్యవహారశైలిపై తీవ్ర దుమారం రేగింది. గతంలో.. వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు… సభ్యులు.. ఎవరైనా సరే.. వెంటనే క్షమాపణలు చెప్పి మాటలను వెనక్కి తీసుకునేవారు. కానీ విపక్షంలో ఉండగా… వైసీపీ మాత్రం.. అలాంటి ప్రయత్నమే చేయలేదు. కామ సీఎం అని చంద్రబాబును, ఎమ్మెల్యే అనితను.. క్యారెక్టర్ పరంగా.. విమర్శించిన రోజాపై.. స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసి… చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబితే… సభకు రానిస్తామని చెప్పనా… వినలేదు. రోజా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు కానీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. విపక్షంలో ఉండగా.. అంతగా పట్టుదలకు పోయిన వైసీపీ.. ఇప్పుడు అధికార పార్టీ స్థానంలో ఉంది. పైగా తిరుగులేని మెజార్టీ ఉంది. ఇక వారికి అడ్డేముంటుందనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. దానికి తగ్గట్లే ప్రవర్తిస్తున్నారు.
ముందు ముందు.. చెవులు మూసుకోవాల్సిందే..!?
అయితే.. ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించినా పోరాటం అనుకుంటారేమో కానీ.. అధికారపక్షంగా మాత్రం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్న వారి ప్రవర్తన ప్రజల్లో నాటుకుంటుంది. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టే.. ఆయన శాసనససభ్యుల శిక్షణా సమావేశాల్లో పాల్గొని… ప్రత్యేకంగా ఈ అంశంపైనే దిశానిర్దేశం చేశారు. ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. కానీ ఆయనే ఉల్లంఘించారు. నాలుగైదేళ్ల కిందటి వరకూ.. ఎవరైనా ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే… సభ్యులు క్షమాపణలు చెప్పేవారు. అలా చెబితే.. ఆ పదాలను రికార్డుల్లో లేకుండా స్పీకర్ తీసేస్తారు. కానీ ఇప్పుడది లేదు. అందుకే.. ముందు ముందు.. ఈ ప్రమాణాలు మరింత దిగజారిపోవడం ఖాయమన్న అభిప్రాయం.. వ్యక్తమవుతోంది. ప్రతీది రాజకీయం అయ్యే.. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.