నంద్యాల ఉప ఎన్నిక తరువాత తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఉంటాయనే వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనీ, టీడీపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వారు కండువా మార్చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు టీడీపీ ఎప్పటికప్పుడు లీకులు ఇస్తూనే ఉంది. జగన్ విధానాలపై ఆ పార్టీలో నమ్మకం పోయిందనీ, ఆయన తీరు చాలామందిని నచ్చడం లేదనీ, పార్టీ కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుతున్నా సరైన గుర్తింపు ఉండటం లేదన్న కారణంతో కొంతమంది బయటకి వచ్చేస్తున్నట్టు టీడీపీ లీకులు ఇస్తోంది. దీన్ని తిప్పి కొట్టేందుకే అన్నట్టుగా వైకాపా కూడా ధీటుగానే స్పందిస్తోంది. తెలుగుదేశం నేతలే తమతో టచ్ లో ఉన్నారనీ, పదవులకు రాజీనామా చేసి వస్తే తప్ప వైకాపాలో చేర్చుకునేది లేదని జగన్ చెబుతున్నారనీ, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని జగన్ చూస్తున్నారంటూ వారు చెబుతున్నారు. అయితే, ఈ జంప్ జిలానీ వ్యూహాల గురించి నేతలు మాట్లాడుకోవడం ఈ మధ్య కాస్త తగ్గిందని అనుకున్నాం.
కానీ, మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి ఇదే అంశాన్ని తెరమీదికి తెచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన దీని గురించి మాట్లాడారు. ప్రతిపక్ష వైకాపాకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన చెప్పడం విశేషం. తెలుగుదేశం పార్టీలో చేరతామంటూ పదేపదే ఫోన్లు చేస్తున్నారని ఆయన చెప్పారు. వైకాపా నేతలు తనకు స్వయంగా ఫోన్లు చేస్తున్నారనీ, ఇప్పటివరకూ ఆరు ఫోన్ కాల్స్ వచ్చాయనీ, వారంతా వైకాపా వదిలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తనతో చెప్పినట్టు మంత్రి అచ్చెన్న చెప్పడం విశేషం! వచ్చే ఎన్నికల్లో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుందనీ, ఆ పార్టీలో ఎవ్వరూ ఉండలేరనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని అచ్చెన్న జోస్యం చెప్పారు.
ఇంతకీ, మంత్రికి ఫోన్ చేసిన ఆ నేతలు ఎవరనేది కూడా బయటపెడితే బాగుండేది కదా! నిజానికి, పార్టీలోకి ఎవర్నైనా రప్పించాలంటే టీడీపీలో డీల్ చేసేందుకు కొంతమంది నేతలుంటారు! వారిలో అచ్చెన్నాయుడు కూడా ఉంటారని అంటారు. గతంలో కొంతమంది నేతల్ని టీడీపీకి ఆహ్వానించడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారనే అంటారు. అలాంటి అచ్చెన్నాయుడికే ఆరు ఫోన్ కాల్స్ వచ్చాయంటే మాటలా చెప్పండీ! అచ్చెన్న మాటల్ని బట్టీ చూస్తుంటే వైకాపాకి త్వరలోనే భారీ కుదుపు ఉంటుందనే అనిపిస్తోంది కదా! అయితే, ప్రతిపక్షం నుంచి అంతమంది ఒకేసారి టచ్ లోకి వస్తే.. ఆ విషయాన్ని ఇలా బహిర్గతం చేయడం ఎందుకు..? జగన్ కు ఝలక్ ఇచ్చినట్టుగా ఆయనతో టచ్ లో ఉన్న నేతలందరికీ ఒకేసారి పచ్చ కండువా కప్పించేస్తే సరిపోయేది కదా. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. ఎన్నికలకు మహా అయితే ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఒకవేళ పార్టీ మారదాం అనుకునేవారు కూడా మరో ఏడాది తరువాత ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తారు. అప్పటికి పార్టీల పరిస్థితులు, విజయావకాశాలు ఎటు ఎక్కువ ఉంటే అటు మొగ్గే ప్రయత్నం చేస్తారు. అంతేగానీ, ఇప్పటికిప్పుడు వలసలకు పోవడం అనేది సరైన వ్యూహం కాదు కదా! ఈ విషయం అచ్చెన్నకు తెలియందైతే కాదు కదా!