మంచి ముహూర్తాలు దాటిపోతాయని తర్వాత మూఢం వచ్చేస్తుందని ఆత్రుతతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు.. తమ తమ పేరుబలాలకు సంబంధించి.. మంచి జ్యోతిష పండితులతో సుముహూర్తాలు పెట్టించుకుని తరలివచ్చి చంద్రబాబునాయుడుతో పచ్చ కండువా కప్పించుకున్నారు. కొన్ని రోజుల కిందట సాయంత్రం పార్టీలో చేరే మీటింగు పెడితే.. ఓ ఎమ్మెల్యే ఉదయం ముహూర్తమే మంచిదని చంద్రబాబు ఇంటికి వెళ్లి కండువా వేయించేసుకున్న వైనం కూడా జనానికి గుర్తుండే ఉంటుంది. ఇదంతా కొన్ని రోజుల కిందటి వరకు జరిగిన వలసల మరియు ఫిరాయింపుల జాతర. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేల వలస మాటలు వినిపించడం లేదు. ఏంటబ్బా అని ఆరా తీస్తే.. మూఢం వచ్చేసింది ముహూర్తాలు లేవు అనే మాటలే వినిపిస్తున్నాయి.
ఎంత చెడ్డా సినిమా వాళ్లలో మాదిరిగానే రాజకీయ నాయకుల్లో కూడా ముహూర్తాలు, జ్యోతిష్యాలకు సంబంధించిన విశ్వాసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద గెలిచి ఇన్నాళ్లూ ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారు… ఏదో రాజకీయంగా మంచి భవిష్యత్తు కోరుకుంటూ తెలుగుదేశంలో చేరుతున్నప్పుడు అందుకు ఖచ్చితంగా మంచి ముహూర్తాలే ఎంచుకుంటారనడంలో సందేహం లేదు. ఒక్కసారి వెనక్కు వెళ్లి చూస్తే.. ఇప్పటిదాకా పార్టీలో చేరిన వారంతా కూడా.. ఆ విధంగా.. మంచి ముహూర్తాలను లెక్కవేసుకునే.. తెదేపా తీర్థం పుచ్చుకున్నారని అర్థమవుతుంది.
కానీ ప్రస్తుతం మూఢం వచ్చేయడంతో వలసలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని కొందరు పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌నుంచి తెలుగుదేశంలో చేరడానికి ఇంకా అనేకమంది సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబుతో మాటామంతీ పూర్తిచేసుకున్న నాయకులు కూడా ఉన్నారని.. అయితే ముహూర్తాలు కుదరక వారు చేరిక తేదీలను వాయిదా వేసుకున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వైకాపా నుంచి ఇంకా 40 మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి రానున్నారంటూ జలీల్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనార్హం. 40 అనే అంకె కరెక్టు కాకపోవచ్చు గానీ.. ఎంతో కొంత మంది ఇంకా వలస వచ్చే ఎమ్మెల్యేలు ఉన్నారన్నది మాత్రం నిజం. వారంతా కూడా కొంతకాలం మౌనంగానే ఉండే అవకాశం ఉంది. మళ్లీ మంచి ముహూర్తాలు వచ్చిన తర్వాత.. పచ్చ కండువాలు కప్పించుకునే జాతర సెకండిన్నింగ్స్ ప్రారంభం అవుతుంది.