వైసీపీ ఎమ్మెల్యేలు సభను బాయ్ కాట్ చేశారు. జగన్ రెడ్డి సభకు ఎవరూ వెళ్లవద్దని ఆదేశించారు. ఆయన ఆదేశాల్ని పాటిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ఎప్పుడు వస్తున్నారో.. ఎలా వస్తున్నారో తెలియదు కానీ నేరుగా అసెంబ్లీకి వచ్చి తాము హాజరైనట్లుగా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్తున్నారు. ఈ వ్యవహారం స్పీకర్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఈ విషయాన్ని సభలో ప్రకటించారు.
వైసీపీ సభ్యులు కొంత మంది సభకు హాజరైనట్లుగా రిజిస్టర్లో సంతకాలు చేశారని వారెవరూ తనకు సభలో కనిపించలేదన్నారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఎందుకని.. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ధైర్యంగా సభకు రాలేరా అని ఆయన ప్రశ్నించారు. వేర్వేరు తేదీల్లో సంతకాలు పెట్టారని స్పీకర్ తెలిపారు. ఆకేపాటి అమరనాథరెడ్డి , విరూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, శివప్రసాద్ రెడ్డి, దాసరి సుధ ఇలా సంతకాలు పెట్టిన వారిలో ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వారి గౌరవాన్ని పెంచేలా ఉండాలని స్పీకర్ హితవు పలికారు.
అనర్హతా వేటు భయంతో ఈ ఎమ్మెల్యేలు సీక్రెట్ గా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కొంత సేపు అయినా కూర్చుని సంతకం పెట్టి వెళ్తే హాజరయ్యారన్న పేరు ఉంటుంది. కానీ అసెంబ్లీకి వచ్చినట్లుగా కూడా ఎవరికీ తెలియకుండా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడం ఆశ్చర్యకరంగామారింది. వీరి తీరు వివాదాస్పదమయ్యే అవకాశాలు ఉన్నాయి.