ప్రతిపక్ష నేతగానే కాదు సీఎంగా కూడ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నీతి వాక్యాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించవు. ఎమ్మెల్యేలను చేర్చుకోను అన్నారు. కండువా కప్పలేదు కానీ వారిని తమ పార్టీ ఇంచార్జులుగా ప్రకటించేసుకున్నారు. ఇలా చెప్పడానికి చేయడానికి పొంతలేని పనులెన్నో చేశారు. ఇప్పుడు మరో నీతి మాలిన పనికి సిద్ధమవుతున్నారు. అదే విపక్ష ఎమ్మెల్యేలతో తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయించుకోవడం. ఇప్పటి వరకూ అసెంబ్లీలో ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగితే.. టీడీపీ నుంచి వైసీపీకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన సభ్యుడు ఓటింగ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఓట్లు వినియోగించుకోబోతున్నారు. లేకపోతే వారి అభ్యర్థి ఓడిపోతారు. నిజానికి టీడీపీకి రావాల్సిన సీటును వైసీపీ లాగేసుకుంటోందన్నమాట. 13వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు !
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో ఉన్న ఎనిమిది మందిలో ఎక్కువ ఓట్లు వచ్చిన మొదటి ఏడుగురు గెలుస్తారు.
వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఏడుగురు అభ్యర్థులకు ఓట్లను సమానంగా పంచితే నలుగురికి 22 ఓట్లు ముగ్గురికి 21 ఓట్లు లభిస్తాయి. తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే… వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కన్నా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు లెక్క. గెలవాల్సింద టీడీపీ అభ్యర్థే.
నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీని ధిక్కరించారు. వారు వైసీపీకి ఓటేయకపోయినా టీడీపీకి లాభమే. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కీలకం. కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరూ పార్టీని ధిక్కరించారు. వారు ఆత్మప్రబోధాను సారం ఓట్లు వేస్తామని చెబుతున్నారు. వారు గైర్హాజర్ అయితే రెండు ఓట్లు తగ్గిపోతాయి. వీరు టీడీపీకి ఓట్లు వేస్తే టీడీపీ అడ్వాంటేజ్ అవుతుంది. కానీ వెంటనే అనర్హతా వేటు పడుతుంది. అప్పుడు ధిక్కరించిన టీడీపీ సభ్యులపై అనర్హతా వేటు కూడా వేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి నీతి మాటలను చెప్పడానికే వైసీపీ పాటిస్తుంది.
ఎలా చూసినా బీసీ నేత ను అక్రమంగా ఓడించడానికి వైసీపీ సిద్ధమయింది. ప్రస్తుత లెక్కల ప్రకారం టీడీపీకి ఓ ఎమ్మెల్సీ సీటు ఖచ్చితంగా రావాల్సిందే. కానీ వైసీపీ కుట్ర రాజకీయాలకు ఓ బీసీ నేత పదవిని కోల్పోవాల్సి వస్తోంది.