ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎం.వి. రామచంద్రారెడ్డి , తూర్పు రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్ధి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్ధి వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎస్. సుధాకర్ పేర్లను ఖరారు చేశారు.
ఐదుగురిలో నలుగురు ఒకే సామాజికవర్గం. మరొకరికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్. అంటే ఒక్కరికి కూడా బడుగు, బలహీనవర్గాలకు చాన్సివ్వలేదు. రేపు మరో ఎనిమది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కూడా అత్యధికం రెడ్లకే అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. విమర్శలు వస్తాయని.. ఒకరిద్దరు ఇతర నేతలకూ చాన్సిచ్చి భారీ ప్రచారం చేసుకోవచ్చు. రెడ్లనుకాదని ఇతరులకు ఒక్క సీటు ఇచ్చినా అది గొప్పేనన్నట్లుగా వైసీపీ ప్రచారం కొంతకాలగా హై రేంజ్లో ఉంది.
ఏ మాత్రం సామాజిక న్యాయం పాటించకుండా.. పార్టీ కోసం పని చేస్తున్న వారికీ అవకాశాలు కల్పించకుండా.. అంతా ఒక వర్గానికే పెద్ద పీట వేస్తూ అటు ప్రభుత్వ పాలన.. ఇటు పార్టీ వ్యవహారాల్లోనూ అదే ధోరణి కొనసాగించడం ఇతర వర్గాల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. అయితే ఆ వర్గాలన్నీ తాము ఏం చేసినా తమకు మాత్రమే ఓట్లేస్తాయని… పదవులన్నీ తామే అనుభవించవచ్చని ఈ పెత్తందారి వర్గం గట్టిగా నమ్ముతున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది.