వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కొత్తగా మూడు ఎమ్మెల్సీ పదవులు చేరనున్నాయి. ఈ మూడు ఎమ్మెల్సీలను మోపిదేవి వెంకటరమణ, ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలకు జగన్ ఖరారు చేశారు. ఇప్పటికే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల ఇరవై ఆరో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న కరణం బలరామకృష్ణ మూర్తి, ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా.. వైసీపీకి తిరుగులేని మెజార్టీ ఉండటంతో.. మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరుతున్నాయి.
ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రివర్గంలోకి మోపిదేవి వెంకట రమణకు కేబినెట్ లో స్థానం కల్పించారు. తప్పనిసరిగా వెంకట రమణకు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉంది. ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాల్సి ఉండటంతో ముందుగా.. మోపిదేవికే ఎమ్మెల్సీని ఖరారు చేశారు. గత ఎన్నికల్లో బాలకృష్ణ మీద హిందూపురంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ గుంటూరులో జరిగిన రంజాన్ విందులో ముస్లింలలకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇక్బాల్ కూడా ఎమ్మెల్సీ పదవిని ప్రకటించంారు. కర్నూల్ జిల్లా బనగానపల్లికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డికి మూడో ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేశారు. ఈయన ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. బనగానపల్లి వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో జగన్ ఆయన శ్రమను గుర్తించారు.
అయితే ఎన్నికల సమయంలో.. జగన్మోహన్ రెడ్డి… పదుల సంఖ్యలో ఎమ్మెల్సీ హామీలిచ్చారు. వారికి అవకాశం కల్పించకుండా.. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నేతలకు.. ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన నేతకు అవకాశం కల్పించడంతో… అవకాశం కోసం ఎదురు చూస్తున్న సీనియర్లలో అసంతృప్తి కనిపిస్తోంది. చిలుకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కు టిక్కెట్ త్యాగం చేసినందుకు.. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని ప్రకటించారు. కానీ ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. వీరే కాదు.. ఎస్వీ మోహన్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి , బుట్టా రేణుక .. ఇలా… ఎమ్మెల్సీ హామీలు పొందిన వారి జాబితా చాలా ఉంది. వారెవరికీ.. ఇప్పుడు చాన్స్ దక్కలేదు.