వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్న సీఎం జగన్ ఈ సారి కొంత మంది సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వకూడదని అనుకుంటున్నారు. వారి కుటుంబసభ్యులకూ చాన్సివ్వకూడదని అనుకుంటున్న ఆయన.. వారికి ఎమ్మెల్సీగా ముందే అవకాశం కల్పించి కామ్ చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ఏడాది ఈ ఏడాది 23 శాసన మండలి పదవులు ఖాళీ కానున్నాయి. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీలు ఐదు తప్ప అన్నీ వైసీపీకే దక్కుతాయి. ఈ ఐదింటికీ అభ్యర్థులను ఖరారు చేశారు.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు సమయంలో అసంతృప్తుల్ని తగ్గించడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వైసీపీకి 18 ఎమ్మెల్సీ సీట్లు ఖాయంగా వస్తాయి. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఎన్నికైతే 2029 వరకు వారు ఆ పదవిలో కొనసాగే అవకాశముంది. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ఆరేళ్ళపాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగవచ్చు. దీంతో ఎమ్మెల్సీ పదవికి భారీ డిమాండ్ పెరిగింది. పలు జిల్లాల్లో సీనియర్ నాయకులు సైతం ఎమ్మెల్సీ పదవులకు పోటీపడున్నారు.
పదవులు ఆశించే నేతలు పార్టీ పెద్దలను కలిసి తమ మనసులో మాట చెబుతున్నారు. పార్టీ పెద్దల వద్ద ఇప్పటికే తమ మనసులో మాట బయటపెట్టిన ఆశావహులు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి హామీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల వేడి పెరగడంతో ఎమ్మెల్సీ పదవుల భర్తీలో ఆచితుచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.గతంలో పలువురికి ఎమ్మెల్సీ హామీలు ఇచ్చి ఉన్నారు. వారంతా ఇప్పుడు పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వని వారిని ఎమ్మెల్సీలుగా పంపడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అసంతృప్తి ఏమీ ఉండదని .. అందరూ సర్దుకుపోతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.