వైసీపీలో మండలి రద్దుపై అంతర్మథనం ప్రారంభమైంది. ప్రస్తుతం మండలిలో వైసీపీకి 9 మంది సభ్యులున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, అసెంబ్లీ టికెట్లు కేటాయించే తరుణంలో కొంతమందికి ఇవ్వలేకపోయారు. వారందరికీ తర్వాత ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. వీరితోపాటు ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉండి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పదవీ గండం ఏర్పడనుంది. ఇక నుంచి శాసనమండలిలో ఖాళీ అయ్యే ప్రతి పదవి కూడా వైసీపీకి దక్కనుంది. శాసనసభ నుంచి ఎన్నికయ్యేవారిలోను, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను గెలిపించుకునే బలం ప్రస్తుతానికి వైసీపీకుంది.
రాబోయే నాలుగేళ్లు సుమారు 30 నుంచి 35 మంది వరకు వైసీపీ నేతలకు ఈ పదవులు దక్కే అవకాశం ఉందని వైసీపీ నేతలే గుర్తుచేస్తున్నారు. అటువంటి అవకాశాన్ని జారవిడుచుకోవటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనను సీఎం జగన్ వద్ద కూడా కొంతమంది నేతలు వినిపించారు. కొంతమంది న్యాయనిపుణులు కూడా శాసనమండలి రద్దు మంచిదికాదని జగన్ కు సూచించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ తీర్మానించి శాసనసభలో ఆమోదించటం తేలికైనప్పటికీ, కేంద్రం వద్దకు బిల్లు పంపి పెండింగ్ లో పడితే పరిస్థితి ఏమిటని వైసీపీ వ్యూహకర్తలు, న్యాయనిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు మండలి రద్దుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
మండలి రద్దుకు హోంశాఖ, న్యాయశాఖ బిల్లును రూపొందించి కేంద్ర కేబినెట్ లో ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోక్ సభ, అనంతరం రాజ్యసభలోనూ ఆమోదించాలి. రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. అందువల్ల ఇన్ని సంశయాల నేపథ్యంలో మండలి రద్దుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపి అది అమలు కాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు సూచించినట్టు తెలిసింది. జగన్ కూడా.. టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీలోకి వస్తే.. రద్దు చేయనని అంటున్నారు.