ఒక టార్గెట్‌ను ఛేదించేందుకు పేల్చిన బుల్లెట్లు వ్యర్థమైన తర్వాత కూడా అదే పని అలాగే చేయడంలో అర్థమేమిటి? ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో జగన్ నాయకత్వంలోని వైసీపీ పరిస్థితి అలాగే వుంది. ఆ పార్టీనుంచి ఎనిమిది మంది ఎంఎల్ఎలను తెలుగుదేశం చేర్చుకోవడం రాజకీయ నైతికత కాదన్నది నిజం. వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని అడగడం న్యాయం. గతంలో చాలా చోట్ల జరిగింది గాని ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్నది కూడా ఫిరాయింపులను యథాతథంగా అనుమతించడమే గనక ఇది కొత్తేమీ కాదు. అయినా విప్ జారీ చేసి వారిని ఇరుకున పెట్టేందుకు వైసీపీ అకస్మాత్తుగా అవిశ్వాసం తెరపైకి తెచ్చింది.ఆ క్రమంలో సభా నిబంధనలను సరిగ్గా అధ్యయనం చేయక అనేక తడబాట్లకు గురైంది. ఎవరు ప్రారంభించాలి ఎలా ముగించాలి వరకూ అంతా అధికార పక్షం పాచికల మేరకు జరిగిపోయింది. అనుభవం లేకపోవడం తప్పు కాదు గాని ఆ మేరకు సలహాలు సూచనలు తీసుకుని సమగ్రంగా సన్నద్ధం కాకపోవడం పొరబాటే. ఏదైతేనేం మూజువాణి తతంగంతో ఫిరాయింపు ఎంఎల్ఎలకు పాలకపక్షం చక్రం అడ్డం వేసింది. ఆ వెంటనే వైసీపీ స్పీకర్‌పై అవిశ్వాసాన్ని ముందుకు తెచ్చింది. గత సమావేశాలు ముగిసిన నాటి నుంచి ఈ మాట వినిపిస్తూనే వుంది గాని మొన్న హఠాత్తుగా ప్రభుత్వంపై అవిశ్వాసం అన్నారు. ఆ ప్రహసనం ముగిశాక ఇప్పుడు మళ్లీ స్పీకర్ పై తీర్మానం ముందుకు తెస్తున్నారు. అంటే అదే తంతు మరోసారి పునరావృతం కావడం తప్ప అదనంగా ఒరిగేది వుండదు. ఫిరాయింపుల చట్టం అమలుకు సంబంధించి అసంఖ్యాకమైన లొసుగులున్నాయి గనక విప్‌లు బ్రహ్మాస్త్రాలని భావించడానికేమీ లేదు. స్పీకర్ కోడెల శివప్రసాద్ వైఖరిని విమర్శించేందుకు అవకాశం లభిస్తుందేమో గాని అదనంగా ఒరిగేది శూన్యం. పైగా ఇలా వెంటవెంట దెబ్బతింటే ప్రతిపక్షంపై సందేహాలు పెరుగుతాయి.