విజయసాయిరెడ్డి మాత్రమే కాదు మొత్తం వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన మరో ఎంపీ అయోధ్యరామిరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారని ఢిల్లీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. ఇక వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబూరావు, మేడా రఘునాధరెడ్డి, నిరంజన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమిళ్ నత్వానీ వైపు నుంచి ఎలాంటి ఖండనలు రావడం లేదు. వారు కూడా రాజీనామాలు చేయడం ఖాయమని చెబుతున్నారు.
ఇటీవల అమరావతి పర్యటనకు వచ్చిన అమిత్ షా ..వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. అందరూ రాజీనామాలకు సిద్దమయ్యారని ఈ అంశంపై ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదానిపై చర్చించినట్లుగా చెబుతున్నారు. వైసీపీ సభ్యులంతా రాజీనామాలు చేసిస బీజేపీలో చేరాలనుకుంటున్నారని ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై కూటమిలోని ఇతర పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు.
రాజీనామా చేసే ప్రతి సీటు కూటమి ఖాతాలోకి వస్తుందని తెలిసినా ఎంపీలు రాజీనామా చేస్తున్నారు. అదీ కూడా బీజేపీతో చర్చల కారణంగానే రాజీనామాలు చేస్తున్నారు. అంటే రాజీనామా చేసిన వాళ్లందరూ బీజేపీలో చేరడం ఖాయమని అనుకోవచ్చు. విజయసాయిరెడ్డి మాత్రం తాను ఏ పార్టీలో చేరనని అంటున్నారు.
జగన్ రెడ్డి ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడ్నుంచే తన పార్టీ నేతల్ని బీజేపీలోకి పంపడానికి అవసరమైన చర్చలు పూర్తి చేశారని అందుకే విజయసాయిరెడ్డి .. రాజీనామా ప్రకటించారని అంటున్నారు. జగన్ లండన్ నుంచి వచ్చేలోపు అందరూ రాజీనామాలు చేసి బీజేపీలో చేరిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీతో ఏ ఒప్పందం జగన్ చేసుకున్నారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.