వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తెలిసి చేస్తున్నారో..తెలియక చేస్తున్నారో కానీ… ఎదురు తన్నే రాజకీయ నిర్ణయాలనే తీసుకుంటున్నారు. తనకు కానీ.. పార్టీకి కానీ మంచి జరిగే నిర్ణయం ఒక్కటీ కూడా తీసుకోవడం లేదు. పార్లమెంట్‌కు ఎంపీలతో రాజీనామాలు చేయడం.. ఓ పెద్ద సెల్ఫ్ గోల్‌గా మారిపోయింది. ఓ వైపు టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేస్తూంటే.. వైసీపీ మాజీ ఎంపీలు నిస్సహాయంగా.. పార్లమెంట్ బయట గాంధీ విగ్రహం వద్ద నిలబడాల్సి వచ్చింది. రాజీనామాలు చేసిన తర్వాతైనా ఉద్యమం చేయించారా అంటే.. అదీ లేదు. రాజీనామాల నిర్ణయం ఇంతగా ఎదురు తన్నిన తర్వాత.. ఇప్పుడు మరో రాజకీయ ఎత్తుగడ వేశారు. అదే టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడం.
నేను ఎంపీలతో రాజీనామాలు చేయించి.. చాలా నష్టపోయాను కాబట్టి.. ఎలాగైనా.. టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించి..సమానం చేయాలనుకుంటున్నట్లున్నారు జగన్. మంగళవారం వైసీపీ బంద్… ప్రత్యేకహోదా కోసం కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ ఎంపీలను రాజీనామాలు చేయాలనే ఒత్తిడి పెంచడానికేనట. ఆ పార్టీ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చి… చేసిన చెలెంజ్లన్నీ…ఇలాగే ఉన్నాయి. ” రాజీనామా చేసే దమ్ముందా..?” .. ధమ్సప్ యాడ్ ప్రకటనల్లాగా చేసుకుంటూ వెళ్లారు. దానికి సాక్షి మీడియా కవరేజీ కూడా బాగానే ఇచ్చుకుంది. అయినా రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఏం చేయగలిగారో అందరూ చూశారు.. మళ్లీ ఇప్పుడు టీడీపీ ఎంపీలను కూడా జగన్ ఎందుకు రాజీనామా చేయమంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
అయినా ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నానంటే.. మైలేజీ వస్తుంది కానీ.. టీడీపీ ఎంపీల రాజీనామాల కోసం బంద్ చేస్తున్నామంటే.. ప్రజలు కూడా నవ్వుకోకుండా ఉంటారా..?. అసెంబ్లీకి వెళ్లరు.. పార్లమెంట్‌కు వెళ్లరు.. పార్లమెంట్‌కు వెళ్లి పోరాటం చేస్తున్న వారిని కూడా రాజీనామాలు చేయించి.. ఇంట్లో కూర్చోవాలని జగన్ డిమాండ్ చేయడం.. చాలా మంది సొంత పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. పార్లమెంట్లో తమకు అడ్డం లేకుండా.. టీడీపీ ఎంపీలతో .. రాజీనామా మైండ్ గేమ్ ఆడాలని.. బీజేపీ టాస్క్ ఇచ్చిందేమో అన్న సందేహం చాలా మందిలో ప్రారంభమయింది. ఈ వ్యూహం వెనుక అసలు కోణం జగన్‌కే తెలియాలి.