నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు.. పేరు.. చెలామణి.. రూల్స్ ప్రకారం ఆ పార్టీ నడకవపోవడం వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరించి ఢిల్లీ పర్యటన చేపట్టినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ పార్టీ గుర్తింపును చిక్కుల్లో పడేసేలా… నిబంధనలను పాటించకుండా… ఆ పార్టీ నడిపిస్తున్న వ్యవహారాలను.. ప్రముఖ న్యాయవాది ద్వారా పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్న రఘురామకృష్ణంరాజు.. ఎన్నికల కమిషన్ దృష్టికి.. ఈ విషయాలన్నీ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసు చెల్లుబాటు గురించి మాత్రమే.. ఈసీతో మాట్లాడుతున్నానని బయటకు ఆయన చెబుతున్నప్పటికీ.. అసలు విషయం మాత్రం అంతకు మించి ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈసీ అధికారులు సహజంగా ఏ రాజకీయ పార్టీ నేత వెళ్లినా.. మహా అయితే.. వినతి పత్రం తీసుకుని.. పంపించేస్తారు. ఇంకొంచెం పెద్ద స్థాయి నేతలు వెళ్తే ఓ అరగంట మాట్లాడతారేమో కానీ… రఘురామకృష్ణంరాజుతో గంటన్నర సేపు మాట్లాడారు. ఆయన వైసీపీ విషయంలో లేవనెత్తిన సందేహాలన్నింటినీ విన్నారు. మొత్తం కరెక్టే అనుకున్నారేమో కానీ.. సమగ్రమైన ఫిర్యాదు లేఖను ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో మరోసారి ఆయన ఎన్నికల సంఘం అధికారుల్ని కలవనున్నారు. ఇప్పటికే అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయాన్ని తెరపైకి తెచ్చిన రఘురామకృష్ణంరాజు.. వైసీపీ గుర్తింపు విషయంలో ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ వేయబోతున్నారని చెబుతున్నారు. తనపై అనర్హతా వేటు వేయిస్తామని హెచ్చరిస్తున్న వైసీపీ నేతలకు రివర్స్ షాక్ ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
రఘురామకృష్ణంరాజుకు.. కేంద్రంలో పలుకుబడి ఉన్నవారు సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. లేకపోతే.. ఢిల్లీలో అదీ కరోనా కాలంలో.. ఆయన ఇంత వేగంగా… భేటీలు నిర్వహించడం కష్టమే. హోంమంత్రిత్వ శాఖతోనూ సమావేశమై.. కేంద్ర బలగాలతో తన భద్రత గురించి చర్చించనున్నారు. రఘురామకృష్ణంరాజు.. కేవలం మాటలతో సరి పెట్టడం లేదని.. అంతకు మించి.. చాలా చేస్తున్నారని.. ఢిల్లీ పర్యటనను పరిశీలించిన రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. వైసీపీ ఆయనను తేలిగ్గా తీసుకుంటే.. చాప కిందకు నీళ్లు తెచ్చేస్తారని చెబుతున్నారు.